కొడుకు కాదు.. కర్కోటకుడు

Son Beats Mother For Opposing Bad Habits In Karnataka - Sakshi

చెడు అలవాట్లతో దారి తప్పిన కుమారుడు 

మందలించిన తల్లిపై దాడి

సోషల్‌ మీడియాలో దాడి ఘటన

సుమోటోగా స్వీకరించిన పోలీసులు 

కృష్ణరాజపురం/బెంగళూరు : దారితప్పుతున్నావంటూ మందలించిన తల్లిపై కన్న కుమారుడు విచక్షణారహితంగా దాడి చేసి హింసించిన ఘటన శనివారం చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు... చెన్నమ్మనకెరె ప్రాంతానికి చెందిన జీవన్‌ (19) డిగ్రీ చదువుతున్నాడు. దురలవాట్లు, ప్రేమించిన యువతి, తోటి స్నేహితులు తనను హీరోగా భావించాలని ఊహించుకునేవాడు.  

ప్రేమాయణం సాగిస్తున్న యువతిని ఇంటికి తీసుకువచ్చి తల్లి ఎదుటే సిగిరెట్లు తాగేవాడు. కళాశాలకు వెళ్లకుండా ప్రియురాలితో షికార్లు, పార్టీలు చేసుకునేవాడు. కన్నకొడుకు తన కళ్ల ముందే నాశనమవుతుండడాన్ని తట్టుకోలేక దురలవాట్లు, పరిపక్వత లేని ప్రేమ వల్ల జీవితాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కొడుకును మందలించింది. ఎన్ని వెధవ పనులు చేసినా పల్లెత్తు మాట అనని తల్లి మంచిమాటలు చెప్పగానే జీవన్‌లో దాగున్న రాక్షసుడు బయటకు వచ్చాడు. తనకే నీతులు చెబితే తగిన శాస్తి చేస్తానంటూ చీపురకట్టతో కన్నతల్లిని తీవ్రంగా కొట్టసాగాడు. వదిలేయమంటూ ఎంత వేడుకున్నా తనకు నీతులు చెబితే ఇలాగే ఉంటుందంటూ మరింత తీవ్రంగా కొడుతూ హింసించాడు.

ఈ తతంగం మొత్తం జీవన్‌ కుటుంబ సభ్యులు మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రసారం కావడంతో పోలీసులు సుమోటోగా స్వీకరించి జీవన్‌పై కేసు నమోదు చేసుకున్నారు. తన కొడుకు బారి నుంచి తనను రక్షించడంతో పాటు తన కొడుక్కి బుద్ధి వచ్చేలా చేయాలంటూ జీవన్‌ తల్లి చెన్నమ్మనకెరె అచ్చుకట్టె పోలీసులను కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top