విద్యార్థిని బలిగొన్న టిప్పర్‌

SKU Student Died in Lorry Accident Anantapur - Sakshi

తల్లడిల్లిన ఎస్కేయూ విద్యార్థులు

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌పై  చర్యలు తీసుకోవాలి

జాతీయ రహదారిపై 4 గంటలపాటు విద్యార్థుల ఆందోళన

ఎస్కేయూ: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎంఏ సోషియాలజీ విద్యార్థి బాలకృష్ణ(22)ను టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించింది. తమ కళ్లెదుటే ఘోరం జరిగిపోవడంతో తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం ఎస్కేయూ వద్ద జాతీయరహదారిపై బైఠాయించారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు.

రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఎస్కేయూ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ (ఎన్‌ఎస్‌సీ) సంస్థ కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డుల ఏర్పాటులో తాత్సారం ప్రదర్శించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టిప్పర్‌ ఢీకొని ఎస్కేయూ విద్యార్థి బాలకృష్ణ దుర్మరణం చెందాడు. ఇందుకు నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బాధ్యత వహిస్తూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌చౌదరికి చెందిన టిప్పర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయాలని నినదించారు. 

భగ్గుమన్న విద్యార్థులు
వందలాదిమంది విద్యార్థులు ఎస్కేయూ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌పై బైఠాయించారు. విద్యార్థి బాలకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నాలుగు గంటలపాటు ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. 8 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళనను విరమించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కాంతి కిరణ్, అంకే శ్రీనివాసులు, హేమంత్‌కుమార్, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు తిరుపాల్, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు శ్రీధర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

దామవాండ్లపల్లిలో విషాదం
నల్లచెరువు: ‘అయ్యో ఎంత పని చేస్తివి దేవుడా.. కుమారుడిని ఉన్నత స్ధానంలో చూడాలనుకుంటిమే. ఇంతలోనే ఎంతపని చేస్తివయ్యా’ అంటూ బాలకృష్ణ తల్లిదండ్రులు రోదించిన తీరు కలచివేసింది. నల్లచెరువు మండలం దామవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, బయమ్మ దంపతుల చిన్నకుమారుడు బాలకృష్ణ ఆదివారం రాత్రి ఎస్కేయూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top