ప్రేమ వ్యవహారంలో మందలించాడని..  | The Shepherd Was Murdered In A Love Affair | Sakshi
Sakshi News home page

మందలించాడని మట్టుబెట్టారు ! 

Aug 21 2019 6:42 AM | Updated on Aug 21 2019 8:04 AM

The Shepherd Was Murdered In A Love Affair - Sakshi

అరెస్టైన నిందితులు 

సాక్షి, తాడిపత్రి: గొర్రెల కాపరి గొల్ల నరేంద్ర హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు అతడిని మట్టుబెట్టినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒక బాలుడు ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. తాడిపత్రి మండలం అయ్యవారిపల్లికి చెందిన గొర్రెల కాపరి గొల్ల నరేంద్ర ఈ నెల 14న గ్రామ పొలిమేరలోని పందికుంట నీటిమడుగులో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కనే ఖాళీ పురుగులమందు డబ్బా పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా లేక గొర్రెల కోసం ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి మేపేందుకు తీసుకెళ్లిన గొర్రెలన్నీ సక్రమంగా ఉండడంతో గొర్రెల దొంగతనం కోసం కాదని తేల్చారు. నరేంద్రకు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు లేవని నిర్దారణకు వచ్చిన పోలీసులు చాకచక్యంగా మరింత వేగంగా దర్యాప్తు చేపట్టారు.  

హత్యకు దారితీసిందిలా.. 
యాడికి మండలం నిట్టూరుకు చెందిన జింకల సర్వేష్‌కుమార్‌ నెల రోజుల కిందట తిరుణాళ్ల సందర్బంగా అయ్యవారుపల్లికి వచ్చాడు. ఈ నేపథ్యంలో సర్వేష్‌కుమార్‌ను ఓ అమ్మాయి ప్రేమ విషయంలో గ్రామానికి  చెందిన కొందరు మందలించారు. వీరిలో గొల్ల నరేంద్ర కూడా ఉన్నాడు. తనను మందలించిన వారిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని సర్వేష్‌కుమార్‌ భావించాడు. అందులో భాగంగానే గొల్ల నరేష్‌ హత్యకు పథకం రచించాడు. సర్వేష్‌కుమార్‌ సొంత తమ్ముడైన జింకల శ్రీకాంత్, కొరివి నాగేంద్ర, బోయ బ్రహ్మయ్యలను కలిసి తనకు ఎదురైన అవమానాన్ని వివరించాడు. గొల్ల నరేంద్రను హత్య చేసేందుకు సహకరించాలని కోరాడు. 

పథకం ప్రకారం కడతేర్చారు.. 
ఈ నెల 14న ఉదయం సర్వేష్‌కుమార్‌ తన తమ్ముడు, తదితరులను వెంటబెట్టుకొని అయ్యవారుపల్లి అటవీప్రాంతానికి చేరుకున్నాడు. అడవి పందుల వేటకోసం వచ్చినట్లు తమకు ఎదురైన వారిని నమ్మించారు. ఓ బాలుడి సహకారం కూడా తీసుకున్నారు. ఇతని ద్వారా గొల్ల నరేంద్ర ఆచూకీ తెలుసుకున్నారు. అయ్యవారిపల్లి పొలిమేరలో ఉన్న పందికుంట నీటి మడుగు వద్ద ఉన్న గొల్ల నరేంద్రను పట్టుకొని తమ వెంటన తెచ్చుకున్న డబ్బాలోని పురుగుల మందును అతడికి బలవంతంగా తాపించారు. పక్కనే ఉన్న నీటి మడుగులో ముంచి ఊపిరాడకుండా చేసి కడతేర్చారు. హత్య చేసినట్లు ఆధారాలు దొరకకుండా నరేంద్ర చొక్కాను తీసుకొని దాన్ని చించివేసి చేతులకు కట్టుకున్నారు. అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. ఆధారాలు దొరకకూడదని చేతులకు కట్టుకున్న చొక్కాగుడ్డ పేలికలను కూడా వెంట తీసుకొని యాడికి మండలం నిట్టూరు సమీపంలోని ఓ పాడుబడిన బోరుబావిలో పడేశారు.  

చాకచక్యంగా దర్యాప్తు 
గొర్రెల కాపరి నరేంద్ర హత్య కేసు అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై ఎస్పీ సత్యయేసుబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే కేసును చేధించాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో తాడిపత్రి, పామిడి, రూరల్‌ సీఐలు వెంకటేశ్వర్లు, రవిశంకర్‌రెడ్డిలు, తాడిపత్రి రూరల్, యాడికి ఎస్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిలు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. నిట్టూరుకు చెందిన నిందితులు జింకల సర్వేష్‌కుమార్, జింకల శ్రీకాంత్, కొరివి నాగేంద్ర, బోయ బ్రహ్మయ్యలను మంగళవారం అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు ఓ బాలున్ని కూడా అరెస్ట్‌ చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు ద్విచక్రవాహనాలతో పాటు ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాలుడిని బాల నేరస్తుల కారాగారానికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement