హత్యకేసు: గుట్టురట్టు చేసిన సీక్రెట్‌ డైరీ

Secret Diary Of Indian Origin Woman Revealed Her Husband Murder Mystery - Sakshi

మెల్‌బోర్న్‌ : మూడేళ్ల క్రితం మెల్‌బోర్న్‌లో హత్యకు గురైన సామ్‌ అబ్రహం కేసులో ఆస్ట్రేలియా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఆరెంజ్‌ జ్యూస్‌లో సైనేడ్‌ కలిపి సామ్‌ను హత్య చేసినందుకు అతడి భార్య, ఆమె ప్రియుడికి శిక్ష ఖరారు చేసింది. వివరాలు... కేరళకు చెందిన సామ్‌ అబ్రహం 2012లో ఉద్యోగ నిమిత్తం  భార్య సోఫియా, కుమారుడితో సహా ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే అక్టోబర్‌ 13, 2015లో సామ్‌ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపిన సోఫియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే మొదట గుండె నొప్పితోనే సామ్‌ మరణించాడని అందరూ భావించారు. కానీ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో విషప్రయోగం వల్లే అతడు మరణించాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు. సోఫియా ప్రవర్తనపై అనుమానంతో ఆమె కదలికలపై దృష్టి సారించారు. కొన్ని రోజుల తర్వాత సోఫియా, కేరళకు చెందిన అరుణ్‌ కమలాసనన్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని వారు గమనించారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా, అరుణ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది.

కీలకంగా మారిన సీక్రెట్‌ డైరీ...
కేరళకు చెందిన అరుణ్‌ కమలాసనన్‌, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోఫియా సామ్‌ అబ్రహంను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్‌కు కూడా వేరొ​క అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు తమ గతాన్ని మర్చిపోలేకపోయారు.

సోఫియా భర్తతో కలిసి మొదట దుబాయ్‌లో ఉండేది. తర్వాత 2012లో వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి సెటిలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్‌ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి సోఫియా, అరుణ్‌లు రహస్యంగా కలుసుకునేవారు. వారు చర్చించుకున్న విషయాల గురించి సోఫియా తన డైరీలో రాసుకునేది. ఈ విషయాలేవీ భర్తకు తెలియకుండా జాగ్రత్తపడేది. ఈ క్రమంలో సామ్‌ అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్‌.. సోఫియాను ఒప్పించి సామ్‌ను హత్య చేసేందుకు పథకం రచించాడు. అందులో భాగంగానే 2015 అక్టోబర్‌లో సామ్‌కు సైనేడ్‌ కలిపిన ఆరెంజ్‌ జ్యూస్‌ ఇచ్చి అతడిని హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సోఫియా జాగ్రత్తపడింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు హత్య కేసును సునాయాసంగా ఛేదించారు.

ఇదే సరైన శిక్ష...
‘సామ్‌ అబ్రహం కుటుంబంతో సహా తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. అతడిని చంపడానికి నిందితులు విషాన్ని(సైనేడ్‌) ఉపయోగించారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన అరుణ్‌ కమలాసనన్‌కు 27 ఏళ్లు, అతడికి సహకరించిన సోఫియాకు 22 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తున్నానంటూ’ జస్టిస్‌ కోగ్లాన్ తీర్పు వెలువరించారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. సోఫియాను నిందితురాలిగా నిరూపించడానికి ఆమె సీక్రెట్‌ డైరీ ఉపయోగపడిందని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top