తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు

Published Fri, Jan 26 2018 6:08 PM

Saidabad police registered a criminal case against Kanimozhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎంపీ కనిమొళి ఇటీవల ఓ సమావేశంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా ప్రసంగించారు. దానిపై హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాది కషింశెట్టి కరుణాసాగర్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐపీసీ 295–ఎ, 298, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం గురించి కనిమొళి మాట్లాడుతూ.. 'దేవుడి ముందు అందరూ సమానమే అని చెబుతారు. అదంతా పచ్చి అబద్ధం. ఎక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొంటే భగవంతుడు త్వరగా ప్రత్యేక దర్శనం ఇస్తాడు. లేనిపక్షంలో 10 గంటలు, 20 గంటలు లేక రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చోవాలి. ఆ దేవుడు అంటే అంతే. శ్రీవారి హుండీ వద్ద సెక్యూరిటీ కాపలా ఎందుకు కాస్తున్నారు. నిజంగా అక్కడ దేవుడు ఉంటే ఆ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముందని' తిరుమల శ్రీవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డీఎంకే ఎంపీపై చెన్నైలోనూ పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement