
ఒంగోలు:ఎంతటి నేరస్తుడైనా ఆలయాలు అనగానే భక్తిశ్రద్ధలు పాటిస్తుంటాడు. అందునా అమ్మవారిని చూడగానే చేతులెత్తి మొక్కుతాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరించడం ప్రారంభించాడు. అమ్మవారి ఆలయాలను టార్గెట్ చేసి వాటిలో కొలువై ఉండే అమ్మవార్ల మెడల్లో అలంకరించిన బంగారు ఆభరణాలను తస్కరిస్తుండడం ప్రస్తుతం పోలీసులకు సవాల్‌గా మారింది.
చోరీ ఇలా: నేరస్తుడు ఎంతో భక్తి ప్రపత్తుడిలా ఉదయం 6 గంటలకే ఆలయాలకు చేరుకుంటాడు. అప్పుడే పూజారి ఆలయం తెరుస్తుండడంతో ఆయన దేవతామూర్తులను అలంకరించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాడు. వచ్చిన భక్తుడు ఆలయంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తూ పూజారికి కొబ్బరికాయలు తెచ్చేవారు ఎవరైనా ఉన్నారా, పూజా సామగ్రి ఎక్కడ దొరుకుతుంది తదితరాలతో మాటలు ప్రారంభించి అమ్మవారి శక్తి గురించి చర్చలు లేవదీస్తాడు. అచ్చమైన భక్తుడిలా వచ్చిన ఆ వ్యక్తిని చూసిన పూజారి ఆయనకు సమాధానం ఇస్తూనే తన కార్యకలాపాల్లో నిగమ్నమై అతనిపై పెద్దగా దృష్టిసారించరు. ఈ క్రమంలోనే ఆ ఆగంతకుడు అమ్మవారి మెడలో ఉన్న బంగారు గొలుసులను సొంతం చేసుకుంటాడు. పూజారికి ఏమాత్రం అనుమానం రాకుండానే అక్కడ నుంచి జారుకుంటూ ఉండడం ఇతని నైజం. తొలుత ఎలా ఆభరణాలు మాయం అయి ఉంటాయంటూ పోలీసులు ప్రాథమికంగా పరిశీలించినా అనుమానం రాలేదు. కానీ వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఐడీ పార్టీ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ప్రత్యేకంగా దృష్టిసారించి సంబంధిత ఆలయాలకు చేరుకొని పూజారులతో మాట్లాడుతూ దొంగ ఎలా ఉంటాడనే దానిపై ఒక స్పష్టతకు వచ్చారు. దాంతో సంబంధిత ఆకారం కలిగిన వ్యక్తిని గుర్తించేందుకు పలు ప్రాంతాలలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే అత్యధికం: స్థానిక గోపాలనగరం తిరుపతమ్మ ఆలయంలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం నగరంలోని పలు ఆలయాలతో పాటు జిల్లాలోని అనేక ఆలయాల్లో ఈ నిందితుడు చేతివాటం చూపాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలను పరిశీలిస్తే స్థానిక గోపాలనగరం, కరణం బలరాం కాలనీ, కమ్మపాలెం, వడ్డెపాలెం, గద్దలగుంట, ఒంగోలు మండలం యరజర్ల, మద్దిపాడు మండలం కొలచనకోట, సంతనూతలపాడు మండలాల్లోని భక్తులు తక్కువుగా ఉండే ఆలయాలపైనే దృష్టిసారిస్తున్నట్లు దీనిని బట్టి స్పష్టం అవుతుంది. ఇటీవలి వరకు నోట్లు ఎరవేసి పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళుతున్నవారి నుంచి లాక్కొని పరారైన దొంగలను చూశాం కానీ, ఏకంగా ఆలయాల్లోని అమ్మవారి మెడల్లోని బంగారు ఆభరణాలనే తస్కరిస్తున్న ఈ దొంగ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.