లాయర్‌ ఖర్చుల కోసం చోరీ | Sakshi
Sakshi News home page

లాయర్‌ ఖర్చుల కోసం చోరీ

Published Tue, Oct 10 2017 3:56 AM

Robbery For Lawyer Expense

సాక్షి, హైదరాబాద్‌: లాయర్‌ ఖర్చుల కోసం దొంగగా మారాడు.. ఓ సోమాలియా జాతీయు డు. రూ.33 లక్షలు చోరీ చేసిన రోజున్నరలోనే రూ.5.28 లక్షలు ఖర్చు చేసేశాడు. ఈ ఘరానా చోరుడిని గోల్కొండ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు దొంగతనం కేసులో నల్లజాతీయుడు అరెస్టు కావడం రాజధానిలో ఇదే తొలిసారి. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పూర్తి వివరాలు వెల్లడించారు. 

జల్సాలకు అలవాటుపడి... 
సోమాలియాకు చెందిన మహ్మద్‌ వలీ అలీ 2014లో స్టూడెంట్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని సన్‌ సిటీలో నివసిస్తూ నిజాం కాలేజీలో బీబీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతడికి సోమాలియా నుంచి తల్లి పంపే డబ్బు సరిపోయేది కాదు. దీంతో ఈ ఏడాది జూన్‌ నుంచి గంజాయి దందా ప్రారంభించాడు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్‌ చేసి నిజాం కాలేజీతో పాటు ఇతర కళాశాలల్లో విక్రయించేవాడు. ఈ ఆరోపణలపై నారాయణగూడ ఎక్సైజ్‌ పోలీసులు అదే నెల 23న అరెస్టు చేసి 10 కేజీల గంజాయి, పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు.  

‘ఖర్చుల’ కోసం చోరీల బాట... 
ఆగస్టులో బెయిల్‌పై వచ్చిన అలీ.. లాయర్‌కు అవసరమైన ఖర్చుల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం పట్టపగలు టోలిచౌకిలోని నదీమ్‌కాలనీలో రియల్టర్‌ మహ్మద్‌ షకీల్‌ ఇంటికి తాళం వేసి ఉండటం గమనించాడు. ఒక చేయి సరిగా పనిచేయకున్నా స్క్రూడ్రైవర్‌తో ఇంటి తాళం, బీరువా పగుల కొట్టిన అలీ.. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల కోసం షకీల్‌ ఉంచిన రూ.33 లక్షల నగదు తస్కరించాడు.

తేలిగ్గా రూ.5 లక్షలు ఖర్చు.. 
శనివారం మధ్యాహ్నం ఈ చోరీ చేసిన అలీ.. సోమవారం ఉదయం నాటికి రూ.5,28,220 ఖర్చు చేసేశాడు. రూ.1.1 లక్షలు వెచ్చించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్, రూ.40 వేలతో ల్యాప్‌టాప్, రూ.24 వేలతో రెండు ట్యాబ్స్, ఐఫోన్‌ 8 తదితరాలు ఖరీదు చేశాడు. రిచ్‌గా కనిపించడం కోసం పది జతల వస్త్రాలు ఖరీదు చేసి కుట్టడానికి టైలర్‌కు ఇచ్చాడు. శనివారం, ఆదివారం స్నేహితులతో కలసి పార్టీలు చేసుకున్నాడు. రూ.1.5 లక్షలు తన స్నేహితుడైన రిచర్డ్‌కు ఇచ్చాడు. శనివారం కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు 25 సీసీ కెమెరాలను అధ్యయనం చేయడం ద్వారా అలీని నిందితుడిగా గుర్తించారు. సోమవారం పట్టుకుని రూ.27,71,780 నగదుతో పాటు అతడు ఖరీదు చేసిన వాహనం, వస్తువులు స్వా ధీనం చేసుకున్నారు. కేసును కేవలం 36 గంటల్లో ఛేదించిన ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ మహ్మద్‌ గౌస్‌ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఫయాజ్‌ తదితరుల్ని డీసీపీ అభినందించారు.

Advertisement
Advertisement