టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి

Road Accident In Adilabad - Sakshi

తాండూర్‌(బెల్లంపల్లి): అప్పటిదాక ఇంటి పనులు చేసుకుంటూ తమముందే కదలాడిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నీటి కోసమని రోడ్డుదాటుతున్న ఆమెను మృత్యువు బొగ్గుటిప్పర్‌ రూపంలో వచ్చి కబళించడం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే...తాండూర్‌ మండల కేంద్రానికి సమీపంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే షేక్‌ మహెబూబ్‌ అలీ, రైసా సుల్తానా (50) దంపతులు సోమవారం ఉదయం ఇంటి అవసరాల కోసం నీళ్లకు ఉపక్రమించారు.

రైసా సుల్తానా రోడ్డు దాటి నీటి కోసం వెళ్తుండగా తాండూర్‌ ఐబీ ప్రాంతం నుంచి మాదారం వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్‌ వేగంగా ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో రైసా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందింది. క్షణాల్లో ఆ మహిళ ఆకాల మరణం చెందడంతో చూపరులు, మృతురాలి కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. మృతదేహంపై పడి కూతుళ్లు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. దీంతో అక్కడికి చేరుకున్న టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ సాబీర్‌ హుస్సెన్‌ తదితరులు అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబీకులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. అర గంటపాటు రాస్తారోకో జరిగింది. సమాచారం అందుకుని సీఐ ఉపేందర్, ఎస్సై కె.రవి అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని చేసుకుని తాండూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top