అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు

Rent HD Cameras Sale in OLX Cheater Arrest - Sakshi

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇచ్చిన వారికి టోకరా

నిందితుడి అరెస్ట్‌ 9 కెమెరాలు స్వాధీనం

రసూల్‌పురా: హెచ్‌డీ కెమెరాలను అద్దెకు తీసుకుని వాటిని విక్రయించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని  బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ. 5లక్షల విలువైన 9 కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.  సీఐ రాజేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి భాగ్‌ అంబర్‌ పేట, రామిరెడ్డినగర్‌కు చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి  బీటెక్‌ చదువుతూ మధ్యలోనే మానేశాడు. ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉంటున్న సోదరుడి వద్దకు వెళ్లిన అతడికి అక్కడ ఉద్యోగం లభించకపోవడంతో 2017 నవంబర్‌లో నగరానికి తిరిగి వచ్చాడు. క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాడి పడిన రిజింత్‌ ‘బెట్‌ 365’ యాప్‌ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో స్నేహితుల నుంచి కెమెరాలు, అమెరికా నుంచి సోదరుడు పంపిన ఐఫోన్లు, ల్యాప్‌ టాప్‌లను విక్రయించి జల్సాలు చేసేవాడు. దుబాయ్‌లో ఉంటున్న అతడి తండ్రి సాంబశివారెడ్డికి ఈ విషయం తెలియడంతో నగరానికి వచ్చిన అతను కెమెరాలు ఇచ్చిన స్నేహితులకు డబ్బులు చెల్లించి గత ఏడాది  రంజిత్‌ను దుబాయ్‌ తీసుకెళ్లి ఐఈఎల్‌ టీఎస్‌లో కోచింగ్‌ ఇప్పించాడు.  గత ఏప్రిల్‌లో నగరానికి వచ్చిన రంజిత్‌ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం మరోసారి క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడి ఆర్థికంగా నష్టపోయాడు.

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు చూసి...
ఓఎల్‌ఎక్స్‌లో హెచ్‌డీ కెమెరాలను అద్దెకు ఇస్తున్న ప్రకటనలు చూసిన అతను సులువుగా డబ్బులు సంపా.దించేందుకు పథకం పన్నాడు. అడ్వాన్స్‌లు చెల్లించి పలువురి వద్ద కెమెరాలను అద్దెకు తీసుకున్నాడు. ఇదే క్రమంలో పాతబోయిన్‌పల్లి మల్లిఖార్డున్‌నగర్‌కు చెందిన మణికంఠ వద్ద హెచ్‌డి కెమెరా అద్దెకు ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వడంతో రంజిత్‌ తన ఆధార్‌కార్డు డిపాజిట్‌ చేసి రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించేలా గత డిసెంబర్‌ 20న రెండు రోజుల అద్దెకు కెమెరా తీసుకెళ్లాడు.  కెమెరా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడంతో మణికంఠ ఈనెల 23న బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రంజిత్‌ కోఠిలోని హిరాదాస్‌ మార్కెట్‌లో కెమెరాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని అరెస్టు చేశారు. రూ. 5లక్షల విలువైన 9 హెచ్‌డీ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top