బౌన్సర్లు బాదేశారు..

PUB Bouncers Attack on 11 Members in Banjarahills - Sakshi

తొమ్మిది మంది యువకులపై దాడి

పబ్‌ రక్తసిక్తం జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

బంజారాహిల్స్‌: బాత్రూంలో న్యాప్కిన్‌ తొలగించలేదన్న నెపంతో 15 మంది బౌన్సర్లు పబ్‌కు వచ్చిన తొమ్మిది మంది యువకులపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంపాపేట్‌కు చెందిన భరత్‌రెడ్డి రెండు వారాల క్రితం అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో కెనడాకు వెళ్లనున్న అతను తన పుట్టిన రోజులు సందర్భంగా ఆదివారం రాత్రి స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకుగాను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని ఆమ్నేషియా లాంజ్‌ పబ్‌కు వచ్చాడు. భరత్‌తోపాటు అతడి స్నేహితులు కార్తీక్‌ రెడ్డి, హితేష్, ప్రణీత్, నవీన్, అనిరుద్, అవినాష్, కేశవ్, గౌరవ్‌ తదితరులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విందు వినోదాల్లో మునిగితేలారు. విందు ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధపడిన వారు కిందికి వస్తున్నారు. అదే సమయంలో రూ.60వేల బిల్లు రావడంతో అక్కడే ఉన్న కార్తీక్‌రెడ్డిని బిల్లు ఎవరు చెల్లిస్తారంటూ బౌన్సర్లు ప్రశ్నించగా, తన స్నేహితుడు చెల్లించాడు కదా అని  చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బౌన్సర్లు అసభ్యంగా దూషిస్తూ పీకల దాకా తాగి జారుకుంటారా అంటూ అవమానించడమేగాక బాత్‌రూమ్‌లో ఇష్టం వచ్చినట్లు న్యాప్కిన్‌లు పడేశారని వాటిని ఎవరు తొలగిస్తారంటూ నిలదీశారు. దీంతో బౌన్సర్లకు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆగ్రహానికి లోనైన బౌన్సర్లు కార్తీక్‌పై చేయిచేసుకోవడమేగాక అడ్డువచ్చిన నవీన్‌ను కొట్టారు. ఎందుకు కొడుతున్నారని అడిగిన అనిరుధ్‌పై దాడికి దిగారు. అనంతరం హితేష్‌ లిఫ్ట్‌ లోకి తీసుకెళ్లి కొట్టుకుంటూ కిందికి తీసుకొచ్చారు. 15 మంది బౌన్సర్లు దాదాపు 2 గంటల పాటు వారిని చితకబాదారు. పబ్‌ మేనేజర్లు ముర్తుజాభాను, మహేశ్‌యాదవ్‌ చోద్యం చూస్తూ బౌన్సర్లను రెచ్చగొట్ట డంతో రూపేష్, శ్రవణ్, కరీం, ఇర్ఫాన్‌ అనే బౌన్సర్లు మరింత రెచ్చిపోయి కార్తీక్‌ తలపై లాఠీతో బాదడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న బౌన్సర్లు వారిపై మరోసారి దాడి చేశారు. అసభ్యంగా దూషించడమేగాక మీ అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులకు చెప్పినా ఏమీ చేయలేరని, పోలీసులు మా వాళ్లేనని చెబుతూ, మరోసారి జూబ్లీహిల్స్‌కు వస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. దీంతో భయాందోళనకు లోనైన కార్తీక్, భరత్, నవీన్, హితేష్, తదితరులు 2 గంటల ప్రాంతంలో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బౌన్సర్లు రూపేష్, శ్రవణ్, కరీంలతో పాటు మేనేజర్లు, పబ్‌ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ముగ్గురు బౌన్సర్లను అరెస్ట్‌ చేయగా, ఇర్ఫాన్‌ పరారీలో ఉన్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top