కేసు క్లోజ్‌..నిందితుల అరెస్టు!

Prakasam Police Reveals 13Years Old Case - Sakshi

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ సత్యఏసుబాబు

ఒంగోలు: అసాధ్యం అనుకున్న హత్య కేసును ఎట్టకేలకు ఛేదించగలిగామని ఎస్పీ సత్యఏసుబాబు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. 2005 జూలై 22వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో సింగరాయకొండ మండలం గవదగట్లవారిపాలెం పొలాల సమీపంలో పొగాకు వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏల్లూరి రఘురామయ్య దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు 94/2005తో  కేసు నమోదు చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు కేసు ఛేదించేందుకు శతవిధాలా యత్నించినా ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక పోలీసులు కేసును అప్పట్లోనే క్లోజ్‌ చేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు
ఇటీవల రాష్ట్ర పోలీస్‌ డిపార్టుమెంట్‌లోని సీఐడీ విభాగం అత్యాధునికమైన పాపిలాన్‌ ఆటోమేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టంను పోలీసులు వినియోగించారు. కేసును ఎలా ఛేదించారో స్టేట్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో డైరెక్టర్‌ వి.సోమశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారం చేసుకొని రాష్ట్రంలోని పోలీసు శాఖలో నమోదై ఉన్న 8 లక్షల వేలిముద్రలను సరిపోల్చినట్లు సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. తొలుత చాలాకాలంగా పరిష్కారం కాని 1406 కేసులను ఛేదించారు. అందులో ప్రస్తుతం చెప్పుకుంటున్న కేసు లేదు. ఇటీవల మళ్లీ ఆ వెర్షన్‌ కాస్తా అప్‌డేట్‌ చేశారు. ఈ దఫా 300 కొత్త కేసుల సమాచారం బహిర్గతమైంది. 2005లో కేసుకు సంబంధించి సేకరించిన వేలిముద్రలతో 2007లో జరుగుమల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో  33/2007లో నిందితుడైన పులివర్తి సీతారామయ్య వేలిముద్రలు సరిపోలాయి. సంబంధిత సమాచారాన్ని ఎస్పీకి రాష్ట్ర పోలీసుశాఖ పంపించింది.

హంతకుల్లో ఒకరు మాజీ హోంగార్డు
అనంతరం పోలీసుశాఖ విచారణ వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకోగా ప్రథమ నిందితుడు మాజీ హోంగార్డుగా గుర్తించారు. ఉలవపాడు మండల కేంద్రానికి చెందిన చెనికల మాధవయ్య, గొత్తుల చంద్రశేఖర్‌ అలియాస్‌ చంద్ర, అదే మండలం మన్నేటికోటకు చెందిన పులివర్తి సీతారామయ్యలు స్నేహితులు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించే వారు. 2005 జూలై 21వ తేదీ రాత్రి ముగ్గురూ ఉలవపాడు వద్ద మద్యం తాగి రాత్రి 10.30 గంటలకు హైవేపై వాహనాలు ఆపడం ప్రారంభించారు. కావలి వైపు నుంచి వస్తున్న మారుతీజెన్‌ కారును ఆపి అందులో సింగరాయకొండ వస్తామంటూ ఎక్కారు. మార్గమధ్యంలో డ్రైవర్‌ను చంపి కారు చోరీ చేయాలని పథకం వేయడంతో ఆందోళన చెందిన సీతారామయ్య కారును ఆపి తన ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం మాధవరావు, చంద్రశేఖర్‌లు డ్రైవర్‌పై దాడి చేసి రఘురామయ్య చేతి నుంచి స్టీరింగ్‌ తీసుకునేందుకు యత్నించారు. కారు డివైడర్‌ను ఢీకొని టైర్‌ పంక్చరైంది.

అనంతరం కారును సింగరాయకొండ నుంచి శానంపూడి వెళ్లే రోడ్డులోకి మళ్లించి గవదగట్లవారిపాలెం పొలాల వద్దకు వచ్చేసరికి రఘురామయ్యను విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. ఆయన జేబులో ఉన్న రూ.600 నగదును తీసుకొని డ్రైవర్‌ రఘురామయ్యను రాళ్లతో తల మీద బలంగా మోది చంపేశారు. అనంతరం మృతదేహాన్ని వెనుక సీట్లో పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించగా కారు మొరాయించింది. కారును వదిలేసి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు నిందితులు పులివర్తి సీతారామయ్య వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. వారిని కేసు నుంచి తప్పిం చేందుకు ఆశ్రయం ఇచ్చినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ప్రథమ నిందితుడైన చెనికల మాధవయ్య హత్య అనంతరం 2009లో పోలీసు శాఖ లో హోంగార్డుగా చేరాడు. 2011లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడం, ఒక కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనతో అతడిని విధుల నుంచి తొలగించారు. రెండో నిందితుడు గొత్తుల చంద్రశేఖర్‌ 2008లో మన్నేటికోట వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కేసు ఛేదించిన అధికారులకు ఎస్పీ ప్రశంస
13 ఏళ్ల నాటి కేసును ఛేదించడంలో కృషి చేసిన ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ దేవప్రభాకర్, ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్‌ వినోద్, కానిస్టేబుల్‌ మహేష్‌లను ఎస్పీ సత్యఏసుబాబు అభినందించారు. నేరస్తుడు ఎవరైనా కటకటాలు లెక్కించక తప్పదని ఎస్పీ సత్యఏసుబాబు హెచ్చరించారు. మొదటి ఇద్దరు నిందితులు హత్య చేయగా మూడో నిందితుడికి సంపూర్ణ సమాచారం ఉన్నా చెప్పకపోవడం, ఆ తర్వాత నిందితులను కాపాడటంతో అరెస్టు చేసినట్లు ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top