విచారణకు రాకుంటే అరెస్టు వారంటే

Police Searching For TV9 Ravi Prakash - Sakshi

రవిప్రకాశ్‌కు నేడు ముగియనున్న గడువు

లుక్‌అవుట్‌ నోటీసుల జారీకి పోలీసుల యోచన 

గాలింపు కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సైబరాబాద్‌ కమిషనరేట్‌లో విచారణకు  హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. 

విచారణకు రాకపోతే అరెస్టే! 
రవిప్రకాశ్‌ విచారణకు రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా పోలీసులు ప్లాన్‌–బీ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్‌ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్‌ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం. సాధారణంగా ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనే ఈ సెక్షన్‌ను ప్రయోగిస్తారు. నిందితులు కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేయడం, బెదిరింపులకు దిగడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేస్తారన్న అనుమానం వస్తే.. మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకుని అరెస్టు చేసే వీలుంటుంది. లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నోటీసులు జారీ చేస్తే.. విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేస్తారు. దీంతో ఆయన ఎక్కడ కనిపించినా అరెస్టు చేసేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అతన్ని గాలించేందుకు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

పత్తాలేని రవిప్రకాశ్‌! 
ఇంతకీ రవిప్రకాశ్‌ ఎక్కడున్నాడన్న విషయం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఆయన ముంబైలో ఉన్నారని, హైదరాబాద్‌లోని సన్నిహితుల వద్ద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన సెల్‌ఫోన్, సోషల్‌ మీడియాలో ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆచూకీపై స్పష్టత లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తమకేం తెలియదని సమాధానమిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన తొలిరోజు ‘తానెక్కడికీ పారిపోలేదని, తన వార్తలు తానే చదువుకున్న రవిప్రకాశ్‌ పరారీలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది’అని నెట్టింట్లో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top