ఎట్టకేలకు తండ్రి చెంతకు జెనిత?

Police interrogate Vanitha Vijayakumar for two hours inside Bigg boss 3 house - Sakshi

కూతురిని కిడ్నాప్‌ చేసిన నటి వనిత కేసులో పురోగతి

విచారణ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌కు మానవ హక్కుల కమిషన్, తెలంగాణ పోలీసులు

రెండుసార్లు విచారించిన పోలీసులు

నిబంధనలకు వ్యతిరేకంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

సాక్షి, చెన్నై : తల్లిదండ్రుల విభేదాల మధ్య నలిగిపోయిన నటి వనిత కుమార్తె జెనితరాజన్‌ ఎట్టకేలకు తండ్రి చెంతకే చేరినట్లు సమాచారం. దివంగత సీనియర్‌ నటి మంజుల, నటుడు విజయకుమార్‌ కుమార్తె వనిత, ఆమె మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ మధ్య గత కొన్ని నెలలుగా న్యాయ పోరు నేపథ్యంలో గత నాలుగు రోజులుగా చెన్నైలో హైడ్రామా నడిచింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ దక్షిణాది రాష్ట్రాల ఉపాధ్యక్షురాలు వసుంధర శ్రీనివాస్, తెలంగాణ, తమిళనాడు పోలీసులు బిగ్‌బాస్‌ హౌస్‌ వేదికగా బుధవారం సాయంత్రం వరకు జరిపిన చర్చల్లో చివరకు చిన్నారి జెనితరాజన్‌ తండ్రి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. 

కూతురు తన వద్దే ఉందని అంగీకరించిన వనిత
వనిత 2007లో ఆనందరాజ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి జెనిత రాజన్‌ అనే కూతురు ఉంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసార జీవితంలో మనస్పర్థల కారణంగా 2012లో దంపతులు విడిపోయారు. 2015లో చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది. కూతురి సంరక్షణ బాధ్యతలను తండ్రికే అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆనంద్‌రాజ్‌ తన కూతురితో సహా హైదరాబాద్‌లో నివశిస్తున్నాడు. గత ఫిబ్రవరిలో వనిత హైదరాబాద్‌కు వెళ్లి పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కూతురిని తీసుకెళ్లిపోయింది. దీంతో ఆనంద్‌రాజ్‌ హైదరాబాద్‌ పోలీసులకు తన కూతురిని వనిత కిడ్నాప్‌ చేసినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. అయితే ఆమెకు చెన్నైలో స్థిర నివాసం లేకపోవడంతో ఆమెను కనిపెట్టి విచారించడం కష్టతరంగా మారింది. 

బిగ్‌బాస్‌ 3 సెట్‌లోకి పోలీసులు.. ఏ క్షణమైనా వనిత అరెస్ట్!

బిగ్‌బాస్‌ హౌస్‌లో వనిత
ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో నటి వనిత ఆచూకీని తెలిపింది. బిగ్‌బాస్‌ సీజన్‌–3లో వనిత పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సౌత్‌ ఇండియన్‌ చాప్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వసుంధర శ్రీనివాస్‌ నేతృత్వంలో పోలీసు బృందం తెలంగాణ హోంమినిస్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం చెన్నైకి వచ్చారు. చెన్నై పోలీసుల సహకారంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. వనితను ఆమె కూతురు జెనిత రాజన్‌ గురించి విచారించగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. మరోసారి విచారించిన వసుంధర శ్రీనివాస్‌ సాయంత్రం 5 గంటలలోపే జెనిత రాజన్‌ గురించిన సమాచారం అందించాలని హెచ్చరించారు. దీంతో వనిత తన కూతురిని బిగ్‌బాస్‌ హౌస్‌కు రప్పించారు. అయితే జెనితారాజన్‌ తన తల్లి, ఆమె తరఫు న్యాయవాది చెప్పినట్లుగా అమ్మతోనే ఉంటానని చెప్పింది.

ఇదిలా ఉండగా తండ్రి ఆనందరాజ్‌.. వనిత తన కూతురిని కిడ్నాప్‌ చేసిందని, న్యాయస్థానం ఆదేశాలతోనే తాను తన కూతురి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల సమయంలో కూతురిపై వనితకు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని, ఏదో దురుద్ధేశంతోనే తను తన కూతురిని కిడ్నాప్‌ చేసిందని ఆరోపించారు. తన కూతురి ఇష్టాఇష్టాలు, తనకేం కావాలో, తన అవసరాలేంటో ఇంతకాలంగా పోషిస్తున్న తనకే తెలుసని, బిడ్డను తీసుకొచ్చి ఎక్కడో పరాయి పెంపకంలో ఉంచి బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌షోలో 100 రోజులు పాల్గొనడానికి సిద్ధం అయిన వనితలో తల్లి ప్రేమ ఎక్కడుందని ఆనంద్‌రాజ్‌ ప్రశ్నించారు. విచారణలో చివరికి తనకు బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోనే ముఖ్యం అని, కూతురు జెనితరాజన్‌ను తండ్రికే అప్పగించడానికి నటి వనిత అంగీకరించినట్లు తెలిసింది. బిగ్‌బాస్‌ హౌస్‌ నియమ నిభంధనలకు వ్యతిరేకంగా నటి వనిత తన కూతురును హౌస్‌లోకి తీసుకురావడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఆ హౌస్‌లో కలకలానికి దారి తీసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top