వీడిన హత్య కేసు మిస్టరీ | Police Chase Murder Mystery case In Kurnool | Sakshi
Sakshi News home page

వీడిన హత్య కేసు మిస్టరీ

Oct 1 2019 11:19 AM | Updated on Oct 1 2019 11:19 AM

Police Chase Murder Mystery case In Kurnool - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్సీ   

సాక్షి, కర్నూలు : కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ మద్దిలేటి దారుణ హత్యకేసు మిస్టరీ వీడింది. కల్లూరు మండలం ముజఫర్‌నగర్‌కు చెందిన పాత నేరస్తులే ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్‌ రెహమాన్, షేక్షావలి, మాసపోగు తేజ, మల్లెపోగు సురేష్‌లను అరెస్టు చేసి కర్నూలు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ ఎదుట హాజరుపర్చారు. సోమవారం సాయంత్రం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో సీఐ రామకృష్ణారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ  వివరాలను వెల్లడించారు. నలుగురు ముఠాగా ఏర్పడి సినీ ఫక్కీలో దొంగతనాలు పాల్పడుతుంటారు. ఆటోలో వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా చేరుకుని చోరీలకు పాల్పడేవారు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోలేదు. ఈ నెల 19న బుధవారపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ మద్దిలేటి బిర్లాగేట్‌ వద్ద ఉన్న దుకాణంలో మద్యం సేవించాడు. బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై వేచి ఉండగా  ముఠా సభ్యులు ఆటోలో వచ్చి మద్దిలేటిని ఎక్కించుకున్నారు.

కృష్ణదేవరాయ సర్కిల్‌ వద్ద వెళ్లేలోగా అతని జేబులు తనిఖీ చేశారు. ఏమీ లేకపోవడంతో మార్గమధ్యలోనే దింపేయత్నం చేశారు. తాను దిగనని ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకెళ్లాల్సిందేనని మద్దిలేటి పట్టుబట్టంతో కోపంతో వారు కిసాన్‌ఘాట్‌వైపు తీసుకెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌ సమీపంలో ఆటోలో నుంచి తోసేసి కర్రతో తలపై బాది వెళ్లిపోయారు. తీవ్ర రక్త స్రావంతో మద్దిలేటి అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. సీసీ కెమెరాల ద్వారా ఆటో, నిందితులను గుర్తించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శిక్ష తప్పదని కర్నూలు వీఆర్‌వో కృష్ణదేవరాయల వద్దకు వెళ్లి నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయారు. పోలీసు స్టేషన్‌లో తమను హాజరు పెట్టమని అభ్యర్తించారు.  వీఆర్‌వో సూచన మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నేరానికి ఉపయోగించిన ఏపీ21టీయూ6994 ఆటోతో పాటు 3సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. ఎస్‌ఐలు వెంకట సుబ్బయ్య, లక్ష్మినారాయణ, హెడ్‌ కానిస్టేబుళ్లు మద్దీశ్వర్,వెంకటస్వామి, రుద్రగౌడ్,  పీసీలు లక్ష్మినారాయణ, పాండునాయక్, షేక్షావలి, వినోద్‌ తదితరులను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement