విస్తుగొలిపే వికృతాలు

Police Case filed against Guntur DFO Mohana Rao - Sakshi

పోలీసు విచారణతో వెలుగులోకి వస్తున్న ఫారెస్ట్‌ అధికారి మోహనరావు లీలలు  

గుంటూరు: గుంటూరు జిల్లా ఫారెస్ట్‌ అధికారి మోహనరావు వికృత చేష్టలపై డొంక కదులుతోంది. పోలీసుల విచారణలో పలువురు బాధిత మహిళలు ఆయన అకృత్యాలను ధైర్యంగా బయటపెడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగాల పేరుతో యువతుల నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వికృత చేష్టలకు పాల్పడుతున్న కె.మోహనరావుపై మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగం పేరుతో రూ.2 లక్షలు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవారని చీరాలకు చెందిన యువతి బుధవారం అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడికొండూరు సీఐ ఎం.ఆనందరావు, సిబ్బంది పేరేచర్లలోని ఫారెస్ట్‌ కార్యాలయానికి చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. 

చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు

అయితే ఫారెస్ట్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువతిని కూడా బలవంతంగా లొంగదీసుకుని సెలవు రోజుల్లో ఆమెపై వికృత చేష్టలకు పాల్పడినట్టు పోలీసుల ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైందని తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం వెళితే రూ.4 లక్షలు తీసుకుని ఆమెను కూడా ఇదే తరహాలో భయపెట్టి లోబరచుకున్నాడు. తన డబ్బు ఇవ్వకుంటే నడిరోడ్డుపై కూర్చుంటానని ఆ యువతి హెచ్చరించడంతో విడతలవారీగా రూ.3.50 లక్షలు తిరిగి ఇచ్చాడని ఆమె చెప్పినట్టు సమాచారం. మాచర్లకు చెందిన ఓ రిక్షా కార్మికుడి కుమార్తెను కూడా ఇదే తరహాలో లోబరుచుకునేందుకు యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అనంతరం మోహనరావు ఆ రిక్షా కార్మికుడిని బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశాడని తెలిసింది. అయితే ఈ విషయం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టిలో ఉండటంతో ఆయన కూడా ఈ విషయాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. 

డీఎఫ్‌ఓను బదిలీ చేయండి
సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు డీఎఫ్‌ఓను మోహనరావును తక్షణమే బదిలీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మోహన్‌రావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో ఆయనను తక్షణమే బదిలీ చేసి, విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ దళాల అధిపతి రిజ్వీని మంత్రి ఆదేశించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top