డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికాడని...

A Person Suspicously Found Dead At  Mancherial Railway Track For Catching Him In Drunk And Drive - Sakshi

సాక్షి, మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎన్నం సంపత్‌(24) మృతి అనుమానాస్పదంగా మారింది. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడడం, ఆ తర్వాత కొద్దిసేపటికే చనిపోతున్నానని స్నేహితులకు ఎస్‌ఎంఎస్‌ చేసి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోం ది. మంచిర్యాల ట్రాఫిక్‌ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ముల్కలపేటకు చెందిన ఎల్కరి గణేష్‌ చెల్లి మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. శనివారం గణేష్‌ చెల్లిని చూసేందుకు అదే గ్రామానికి చెందిన స్నేహితులు ఎన్నం సంపత్, కూన సంతోష్, ఎల్కరి పురుషోత్తంతో కలిసి ఆటోలో వచ్చారు. ఆసుపత్రిలో గణేష్‌ చెల్లిని చూసిన తర్వాత నలుగురు కలిసి ఐబీ చౌరస్తాలో మద్యం తాగారు. అనంతరం సంపత్‌ ఇంటికి వెళ్లేందుకు చెన్నూర్‌ బస్‌ ఎక్కాడు. మిగతా స్నేహితులు పురుషోత్తం, సంతోష్‌లు గణేష్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సంపత్‌ కొద్దిక్షణాల్లోనే బస్సు దిగి బస్టాండ్‌ వద్ద తన స్నేహితులు ఉన్నారని గణేష్‌ వద్ద నుంచి ఆటో తీసుకుని వెళ్లాడు. ఐబీ నుంచి బస్టాండ్‌ వైపు వస్తూ ఆటోను అడ్డదిడ్డంగా నడిపాడు.

దీంతో స్థానికులు గుర్తించి ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు సంపత్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టు చేశారు. సంపత్‌ మద్యం తాగినట్లు 200 శాతం నిర్దారణ కావడంతో పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సంపత్‌ ఈ విషయాన్ని గణేష్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. ఈ క్రమంలోనే మరికొంత మంది స్నేహితులకు తాను చనిపోతున్నానని ఎస్‌ఎంఎస్‌ చేసి సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. 
రైలు పట్టాలపై శవంగా.. 
డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ సంపత్‌ కొద్ది గంటల అనంతరం రైలు పట్టాలపై శవంగా కనిపించాడు. చనిపోతున్నానని ఎస్‌ఎంఎస్‌ చేయడంతో ఆందోళనకు గురైన గణేష్‌ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. సంపత్‌ వద్ద నుంచి ఆటోను స్వాధీనం చేసుకుని, రేపు రమ్మని పంపివేసినట్లు పోలీసులు సమాధానం ఇచ్చారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సంపత్‌ ఆదివారం ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఏ క్యాబీన్‌ వద్ద రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకున్నారు. 

కుటుంబంలో విషాదచాయలు.. 
సంపత్‌ మృతితో ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ముల్కలపేటకు చెందిన ఎన్నం లింగయ్య– సమ్మక్క దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇందులో రెండో కుమారుడు సంపత్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులతో మంచిర్యాల వచ్చి అనుమానాస్పదంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కేసులో అసలు నిజాలు పోలీసులు దర్యాప్తు చేసి బయట పెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  

స్నేహితులు ఏమైనట్లు.?
సంపత్‌తో పాటు వచ్చిన స్నేహితులు సంతోష్, పురుషోత్తం పరారీలో ఉండడం, తాను చనిపోతున్నానని చెప్పినా గణేష్‌ పట్టించుకోకపోవడంతో మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడడంతో మనస్థాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా పురుషోత్తం, సంతోష్, సంపత్‌ మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు కలిసి మద్యం సేవించిన అనంతరం సంతోష్, పురుషోత్తం ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. మరోవైపు సంపత్‌ ఒక్కడే రైలు పట్టాల వైపు ఎందుకు వెళ్లాడు అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం తేలనుంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top