బీమా సొమ్ము కోసం సొంత అన్న కొడుకే..

Person Murdered For Insurance In Nalgonda - Sakshi

గత నెల 24న రోడ్డు ప్రమాద మృతిగా కేసు నమోదు

కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు   

సాక్షి, మునగాల(కోదాడ) : గత నెల 24న జాతీయ రహదారిపై మండలంలోని ఇందిరానగర్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన మండలంలోని తాడువాయికి చెందిన ముంజల సైదులు (30) కేసు మిస్టరీని మునగాల పోలీసులు ఛేదించారు. మునగాల  సీఐ శివశంకర్‌ గౌడ్‌ శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాడువాయి గ్రామానికి చెందిన ముంజల సైదులు గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి అన్న ముంజల వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చింది.

మృతుడి అన్న కొడుకు రమేష్‌  ఒంటిరిగా ఉంటే తన బాబాయి సైదులు పేరుమీద కొన్ని రోజులు క్రితం రెండు లారీలు ఫైనాన్స్‌లో కొనుగోలు చేశాడు. దీంతో పాటు రూ.50 లక్షల ఇన్సూ్రెన్స్‌ కూడా చేయించాడు. కొన్ని రోజుల తర్వాత లారీలు నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఫైనాన్స్‌ వారికి డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో వారు లారీలను తీసుకెళ్లారు. దాంతో తన బాబాయి ప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మిస్తే ఇన్సూరెన్స్‌ వస్తుందని పథకం వేశాడు.

తన స్నేహితులైన  గంధం మహేష్, మాతంగి శోభన్‌బాబును సంప్రదించి చెరో రూ.ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. గతనెల 24న సైదులును గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి తీసుకొవచ్చి మార్గమధ్యలో మద్యం తాగించారు. అనంతరం జాతీయ రహదారిపై ఇందిరానగర్‌ శివారులో గల పార్కింగ్‌ స్థలం (ట్రక్‌ లే అవుట్‌) వద్ద బొలోరో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. అదే రోజు మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. కాగా గతంలో కూడా ఒకసారి సైదులును హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. 

వెలుగులోకి వచ్చింది ఇలా....
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంటరిగా ఉండే సైదులు పేరు మీద రూ.50 లక్షల బీమా ఎందుకు చేయించారని ఆరా తీశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాద సంఘటన వెనుక మృతుడి అన్న కొడుకు రమేష్‌ హస్తం ఉంటుందని అనుమానించి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పాడు.

బీమా సొమ్ము కోసమే రమేష్‌ హత్య చేసినట్లు సీఐ వివరించారు. దీంతో రమేష్‌తో పాటు స్నేహితులు మహేష్, శోభన్‌బాబులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి శుక్రవారం కోదాడ కోర్డులో రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మునగాల ఎస్‌ఐ కె.సత్యనారాయణ గౌడ్, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top