భార్యను దూరం చేశారని..

Person Dissappointed As His Wife Is Not Coming In Rangareddy - Sakshi

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

పోలీసులు సర్దిచెప్పడంతో కిందికి దిగిన వైనం

సాక్షి, ఆమనగల్లు: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తననుంచి దూరం చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. కిందికి దిగేందుకు అతడు ససేమిరా అనడంతో స్థానికులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తలకొండపల్లికి చెందిన నీలకంఠం పాండు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలం ప్రేమించి గత నవంబర్‌ 21న వివాహం చేసుకున్నాడు.

కులాంతర వివాహం కావడంతో యువతి తల్లిదండ్రులు, కులపెద్దలు, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను తనకు దక్కకుండా దూరం చేశారని ఆరోపిస్తూ శనివారం తెల్లవాముజామున 5.30 గంటలకు పాండు ఆమనగల్లులోని ప్రధాన రహదారిపై ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కాడు. అనంతరం అతడు తన బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు వాట్సప్‌లో పంపాడు. విషయం తెలియడంతో పట్టణవాసులు, ఆమనగల్లు సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ ధర్మేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం సీఐ టవర్‌పై ఉన్న పాండు సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌లో మాట్లాడారు.

తాను పెళ్లి చేసుకున్న యువతిని ఇక్కడికి రప్పించి తనతో మాట్లాడిస్తే కిందికి దిగుతానని లేదంటే పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. కిందికి దిగిన తర్వాత యువతి కుటుంబసభ్యులతో మాట్లాడిస్తామని పోలీసులు సర్దిచెప్పినా పాండు వినలేదు. అతడి కుటుంబీకులు, బంధువులు అక్కడికి చేరుకొని కిందికి దిగాలని ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక చివరకు పోలీసులు యువకుడు వివాహం చేసుకున్న యువతితో మాట్లాడారు.

తనను పాండు బెదిరించడంతోనే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. తాను అక్కడికి రానంటూ స్పష్టం చేసింది. చివరకు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సీఐ నర్సింహారెడ్డి సెల్‌ఫోన్‌లో మరోసారి పాండుతో మాట్లాడారు. యువతి తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉందని, కిందికి దిగితే అక్కడికి తీసుకెళ్లి మాట్లాడిస్తామని పాండుకు చెప్పడంతో అతడు దిగి వచ్చాడు. అనంతరం పాండును సీఐ నర్సింహారెడ్డి తన వాహనంలో తలకొండపల్లికి తీసుకెళ్లారు. పాండు కిందికి దిగడంతో పోలీసులు, స్థానికులు, అతడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top