ఏం కష్టమొచ్చిందో ఏమో ?

Person Committed Suicide Lying Under Train In Srikakulam - Sakshi

సాక్షి, మందస(శ్రీకాకుళం) : కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు.. విదేశానికి వెళ్లి మరీ కష్టపడుతున్నాడు.కూలీనాలీ చేసుకునే ఆ కుటుంబానికి పెద్ద దిక్కై నిలిచాడు. నమ్ముకున్నవారిని అనాథను చేసి వెళ్లిపోయాడు. ఇక ఆ కుటుంబానికి దిక్కు లేకపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు హృదయ విదారకరంగా మారింది. మందస పట్టణంలోని ఆర్టిజన్‌ కాంప్లెక్స్‌లో నివాసముంటున్న కోటిలింగాల భీముడు, జయంతిల కుమారుడు రమేష్‌ (24) ఉన్నారు. కుమార్తె  సంతోషికి వివాహమైంది. కుమారుడే కుటుంబానికి ఆధారంగా మారాడు.

భీముడు, జయంతిలు పేదవారు కావడంతో కూలీ చేసుకుని జీవిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక వారిని పోషించడానికి రమేష్‌ ముందుకు వచ్చాడు. విదేశానికి(కువైట్‌) వెళ్లాలని నిర్ణయించుకుని పాస్‌పోర్టు, వీసా సంపాదించి వెళ్లాడు. కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ 10 రోజుల సెలవుపై మందస వచ్చాడు. ఈ నెల 10న మళ్లీ కువైట్‌ వెళ్లిపోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తల్లిదండ్రులు కుమారుడి ఇష్టమైన పిండివంటలు, వస్తువులు సిద్ధం చేస్తూనే... ఒక్కగానొక్క కుమారుడైన రమేష్‌ను విదేశాలకు వెళ్లవద్దని, తమకు దూరంగా ఉండడం ఇష్టంలేదని చెప్పారు. అయినప్పటికీ  రమేష్‌ కుటుంబ కష్టాలు దృష్ట్యా కువైట్‌ వెళ్తానని భీష్మించుకున్నాడు.

సోమవారం ఉదయం  సినిమాకు కాశీబుగ్గ వెళ్తానని చెప్పిన రమేశ్‌ మంగళవారం వరకు తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు రమేష్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ చేసినట్టు సమాచారం వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి హరిపురం సమీపంలో యువకుడి ఆత్మహత్య అంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ కావడంతో వాటిని గుర్తించిన రమేష్‌ స్నేహితులు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపారు. 

బాలిగాం–రైల్వేస్టేషన్‌ మధ్య మృతదేహం గుర్తింపు
మండలంలోని హరిపురం సమీపంలోని బాలిగాం–రైల్వేస్టేషన్‌ మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఆస్పపత్రిలో పోస్టుమార్టం అనంతరం మందస పట్టణానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. మరుసటి రోజున విదేశాలకు వెళ్లాల్సిన  కుమారుడు అందని తీరాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top