భూమి మీద నా ఆయుష్షు అయిపోయింది.. | New Bride Committed Suicide In Medak | Sakshi
Sakshi News home page

నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..

Jul 28 2018 9:36 AM | Updated on Oct 16 2018 3:15 PM

New Bride Committed Suicide In Medak - Sakshi

నాగరాణి(ఫైల్‌)నాగరాణి రాసిన సూసైడ్‌ నోట్‌ 

చిన్నమ్మ కూతురును బాబుకు ఇచ్చి పెండ్లి చేయండి. అతను చాలా మంచోడు..

వెల్దుర్తి(తూప్రాన్‌): ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా భర్త చాలా మంచోడు.. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాదకర ఘటన మండల పరిధి ఉప్పులింగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పులింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్ర బాబుకు ఏ ఈడాది మే నెల 11న మెదక్‌ మండలం పాతూర్‌ గ్రామానికి చెందిన కళమ్మ, రాములు దంపతుల కూతురు నాగరాణి(21)తో వివాహం జరిగింది.

బాబు తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా సోదరుడు కృష్ణ నగరంలో పని చేసుకుంటున్నాడు. రోజు మాదిరిగా బాబు ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి రాగా లోపలి నుండి గడియ పెట్టి ఉంది. అనుమానంతో ఎంత పిలిచినా లోపలి నుండి ఎలాంటి శబ్ధం వినిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై గంగరాజు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక గడియ లోపలి తాళాలు పగులకొట్టారు.

లోపలికి వెళ్లి చూడగా నాగరాణి శవమై కనిపించింది. శవం పక్కనే మంచంపై ఉన్న సూసైడ్‌ నోట్‌ను వారి కుటుంబీకులు గమనించి పోలీసులకు అప్పగించారు. అందులో ‘‘నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను. బతకాలన్న ఆశ నాలో పూర్తిగా చచ్చిపోయింది.. 2,3 రోజుల నుండి చనిపోవాలన్న ప్రేరణ కలుగుతోంది. నేను ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు. అందుకోసం నా తనువు చాలిస్తున్నానంటూ’ రాసి ఉంది.

‘‘దయచేసి ఎవరూ బాధపడొద్దు, నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను సంతోషంగా చనిపోతున్నా. వీలైతే మాల్తుమ్మెద గ్రామానికి చెందిన చిన్నమ్మ కూతురును బాబుకు ఇచ్చి పెండ్లి చేయండి. అతను చాలా మంచోడు’’ అని రాసింది. నా వస్తువులన్నీ చెల్లెలుకే ఇవ్వండి. దయచేసి నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి.

ఈ భూమి మీద నా ఆయుష్షు అయిపోయినట్లుంది అందుకే వెళ్లిపోతున్నా నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు నేనే’’ అని రాసింది. ఇది చదివిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పెళ్లయిన మూడు నెలలకే నూరేండ్లు నిండాయా బిడ్డా అంటూ విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టంకోసం మెదక్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement