ఎన్‌డీ తివారీ కుమారుడిది హత్యే!

ND Tiwaris Son Rohit Shekar Was Smothered Said By Delhi Police - Sakshi

న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఈ నెల 16న మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డీ తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ తివారీది హత్యేనని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.  శవపరీక్ష ఆధారంగా రోహిత్ శేఖర్‌ మర్డర్‌ మిస్టరీ చేధించనున్నట్లు స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ఎస్‌ క్రిష్‌నియా తెలిపారు.  శవపరీక్షలో రోహిత్‌ శేఖర్‌ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు.

రోహిత్‌ శేఖర్‌ నివాసాన్ని ఫోరెన్సిక్‌ అండ్‌ క్రైం బ్రాంచ్‌ టీంలు ఇదివరకే క్షుణ్ణంగా పరిశీలించాయి.  బుధవారం రోజు సాయంత్రం 4.41 నిమిషాలకు రోహిత్‌ శేఖర్‌  నివాసం నుంచి మాక్స్‌ ఆసుపత్రికి ఒక ఎమర్జెన్సీ కాల్‌ వచ్చిందని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. అంబులెన్స్‌లో రోహిత్‌ శేఖర్‌ను మాక్స్‌ ఆసుపత్రికి ఆగమేఘాల మీద తీసుకువచ్చారని, డాక్టర్లు పరిశీలించి చూడగా రోహిత్‌ శేఖర్‌ అప్పటికే చనిపోయి ఉన్నట్లు నిర్దారించారని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఏప్రిల్‌ 11న హల్డ్‌వానీలో తన ఓటు హక్కును శేఖర్‌ తివారీ ఉపయోగించుకున్నారు. శేఖర్‌ తివారీ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సోమవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని హల్డ్‌వానీ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హల్డ్‌వానీలో దీపక్‌ బాలుటియా అనే తన సోదరుడితో శేఖర్‌ తివారీ కొంతకాలంగా ఉంటున్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఇరుగుపొరుగు వారితో శేఖర్‌ తివారీ చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరడాన్ని రోహిత్‌ తివారీ తన సొంతపార్టీలో చేరుతున్నట్లుగా అభివర్ణించాడని బాలుటియా ఇదివరకే తెలిపారు.

స్వతహాగా న్యాయవాది అయిన శేఖర్‌ తివారీ ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు 2015-2017 మధ్య సలహాదారుగా పనిచేశారు. రోహిత్‌ శేఖర్‌ తివారీ తండ్రి నారాయణ్‌ దత్‌ తివారీ గత ఏడాది అక్టోబర్‌లో మరణించిన సంగతి తెల్సిందే. రోహిత్‌ శేఖర్‌ తివారీకి తల్లి, భార్య ఉన్నారు. మొదట రోహిత్‌ శేఖర్‌ తన కుమారుడు కాదని ఎన్‌డీ తివారీ వాదించిన సంగతి అప్పట్లో సంచలనమే సృష్టించింది. దీంతో రోహిత్‌ శేఖర్‌ కోర్టుకు వెళ్లడంతో కోర్టు డీఎన్‌ఏ టెస్టుకు వెళ్లాలని సూచించింది. ఎట్టకేలకు 2014లో రోహిత్‌ శేఖర్‌ తన కుమారుడేనని ఎన్‌డీ తివారీ ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. ఆ తర్వాత ఎన్‌డీ తివారీ, రోహిత్‌ శేఖర్‌ తల్లి ఉజ్జ్వలను వివాహమాడారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top