నిరుపేదలకూ టోపీ

Municipal Vice Chairperson Cheating Poor People In Nellore - Sakshi

సూళ్లూరుపేట : క్యామెల్‌ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులకే కాకుండా నిరుపేదలకూ టోపీ పెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన గరిక ఈశ్వరయ్య, ఈశ్వరమ్మ సూళ్లూరుపేట కేంద్రంగా క్యామెల్‌ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేస్తూ సంస్థను అభివృద్ధి చేసుకున్నారు. సంస్థకు అనుబంధంగా క్యామెల్‌ మహిళా మ్యాక్స్‌ అనే సంస్థను 2002లో స్థాపించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. 2002 నుంచి ఈ సంస్థలో మహిళలు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకుంటే తామే రుణాలిచ్చి ఆదుకుంటామని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో నాలుగు బ్రాంచీలను స్థాపించారు. సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వరదయ్యపాళెంలో నాలుగు బ్రాంచీలను ఏర్పాటు చేసి 500 గ్రూపులను తయారు చేశారు.

సుమారు 10 వేల మంది పొదుపు మహిళలను చేర్చుకొని వారితో రూ.20 నుంచి రూ.200 వరకు పొదుపు చేయించి నగదును వీరి వద్దే ఉంచుకున్నారు. పొదుపు కట్టిన పుస్తకాలను కూడా వీరివద్దే ఉంచుకున్నారు. 2002 నుంచి 2009 వరకు పొదుపు చేసిన మొత్తాన్ని చూపించి నాబార్డు, ఇతర బ్యాంకుల నుంచి సుమారు రూ.9.21 కోట్లను రుణంగా తీసుకున్నారు. ఇందులో మహిళలకు రుణాలిస్తూ కట్టుకుంటూ వచ్చారు. నాబార్డు శాఖ రూ.50 పైసల వడ్డీకే సంస్థలకు రుణాలిస్తే దాన్ని పొదుపు మహిళలకు రూ.రెండు వడ్డీకి ఇచ్చి అందులో రూ.1.5 వడ్డీని ఆదాయంగా మలుచుకున్నారు. మెయింటెనెన్స్‌ కింద నాబార్డు వారు క్యామెల్‌ మహిళా మ్యాక్స్‌కు 2.5 శాతం ఇవ్వగా, క్యామెల్‌ వారు మాత్రం పొదుపు మహిళల నుంచి ఐదు శాతాన్ని వసూలు చేశారు.

గ్రూపుల్లో ఎవరైనా రుణాలు తీసుకోకపోయినా, వారి పేర్లపై కూడా తీసుకున్నట్లు రికార్డులు ఉన్నాయని చెప్తున్నారు. గ్రూపునకు రూ.రెండు లక్షలు ఇచ్చినట్లు వారి వద్ద నుంచి సంతకాలు చేయించుకొని 2 పక్కనే 1 వేసుకొని రూ.10 లక్షలు తీసుకున్న సందర్భాలున్నాయని వారి వద్ద పనిచేసిన వారు చెప్పడం విశేషం. చాలా మంది రుణాలను చెల్లించినా వారికి క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో మండలంలోని పేర్నాడు పల్లెల్లో చాలా మందికి హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ముందుగా ఆమె వచ్చి తాము కట్టిన పొదుపు నగదు మొత్తం ఎంత ఉంది..ఎంత కట్టాలనే విషయాలను నిగ్గుతేలిస్తే ఆమే తమకు బాకీ పడుతుందని అంటున్నారు. 

భారీగా స్థిరాస్తులు
నిరక్షరాస్యులను మోసం చేశారు. చివరికి బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో పొలీసుల కస్టడీలోకి తీసుకున్న ఈశ్వరమ్మను టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య వదిలేయమని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. ఆమెను పూర్తిస్థాయిలో విచారించి ఉంటే నిజాలు నిగ్గుతేలి ఉండేవి. ఓజిలి మండలంలో 16 ఎకరాలు, తనియేలి వద్ద 12 ఎకరాలు, సూళ్లూరుపేటలో మూడేసి అంతస్తులు కలిగిన రెండు పెద్ద భవనాలు, పరమేశ్వరినగర్‌లో రెండు ప్లాట్లతో పాటు నెల్లూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కూడా స్థిరాస్తులను కూడబెట్టినట్టు సమాచారం. 

హోంగార్డు నాగూరమ్మను  బలిచేసే యత్నం 
ఆర్థికపరమైన కేసులో ఈశ్వరమ్మను పట్టుకొని అధికార పార్టీకి చెందిన పరసారత్నం ఫోన్‌ చేశారని వదిలిపెట్టేసి ఇప్పుడు హోంగార్డు నాగూరమ్మను బాధ్యులు చేయాలని సీఐ కిషోర్‌బాబు ఒత్తిడి తెస్తున్నారు. తప్పు చేశావని అంగీకరించి సంతకం చేయమని సీఐ ఒత్తిడి చేస్తున్నారని నాగూరమ్మ ఆరోపిస్తున్నారు. నెల్లూరులో ఆమె ఎస్పీ రామకృష్ణను కలిసి తన గోడును తెలియజేశారు. ఇందులో తనకు సంబంధం లేకపోయినా హోంగార్డునని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గూడూరు డీఎస్పీ విచారణ
సూళ్లూరుపేట రూరల్‌ : తన తప్పిదాన్ని గుర్తించి ఎస్పీ ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని భయపడిన ఎస్సై నెపాన్ని హోంగార్డుపై వేసే యత్నం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను సరెండర్‌ చేస్తూ మెమో ఇచ్చారు. అందులో ఆర్‌ఐ, హోంగార్డు అని రాయాల్సిన చోట ఆర్‌ఐ, వీఆర్‌ అని రాయడంతో నాగూరమ్మను వీఆర్‌ పోలీసులు సరెండర్‌ చేసుకోలేదు. దీంతో ఆమె తిరిగి సూళ్లూరుపేటకు వచ్చేశారు. శనివారం మధ్యాహ్నం గూడూరు డీఎస్పీ రాంబాబు ఘటనపై విచారణ జరిపారు. అందర్నీ పిలిచి వివరాలను సేకరించారు. ఆ సమయంలో ఎస్సై మరోసారి నాగూరమ్మకు సరెండర్‌ మెమో ఇచ్చి నెల్లూరుకు పంపించేశారు.  

ఈ ఫొటోలోని మహిళ పేరు కుప్పంపాటి నాగమ్మ. సూళ్లూరులోని బొగ్గుల కాలనీలో 32 మందితో ఝాన్సీ మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనిషికి రూ.20 చొప్పున గరిక ఈశ్వరమ్మ నిర్వహిస్తున్న క్యామెల్‌ మహిళా మ్యాక్స్‌లో పొదుపు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొన్ని గ్రూపుల్లో సభ్యులు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉన్న గ్రూపుల నుంచి సర్దుబాటు చేయడంతో 20 మంది లెక్కన ఒక్కో గ్రూపులో ఉంటూ వచ్చారు. రూ.20తో ప్రారంభించిన పొదుపును 2013 నాటికి నెలకు రూ.200 వరకు చెల్లించారు. ఈ గ్రూపులను ఆధారంగా చేసుకొని ఒక్క నాబార్డు సొసైటీ నుంచి మహిళా సాధికారత పేరుతో రూ.7.21 కోట్లను రుణాలుగా తీసుకొచ్చారు. పొదుపు మహిళలకు ప్రతి గ్రూపునకు రూ.రెండు లక్షల చొప్పున ఇచ్చారు. ఈ నగదుకు రూ.రెండు వడ్డీ లెక్కన వసూలు చేసి, మహిళలు పొదుపు చేసుకున్న డబ్బులకు మాత్రం రూ.0.50 పైసల వడ్డీ ఇస్తూ వచ్చారు. ముందుగా పొదుపు కింద ఎంత కట్టారో లెక్కలు చూపించకుండా రుణంగా తీసుకున్న మొత్తాన్ని కట్టాలని ఇటీవల ఒత్తిడి చేశారు. పొదుపు మహిళలు ఎంత పొదుపు చేసుకున్నారో చూపిస్తే రుణం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాంకులను మోసం చేసినట్లే పొదుపు సంఘాల్లో నిరుపేద మహిళలనూ ఈశ్వరమ్మ మోసం చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top