పరువు తీశాడని చంపేశారు!

Moinkhan Dignity Murder - Sakshi

పరువుపోతుందనే మోయిన్‌ఖాన్‌ను హతమార్చారు

హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

నిందితుల్లో నలుగురిది మెదక్, ఒకరిది హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ

న్యాయపరంగానే కేసు విచారణ

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు

మెదక్‌రూరల్‌: పేద, ధనిక తారతమ్యమే ఆ ప్రేమికుడి ప్రాణం తీసింది. సంపన్నుల అమ్మాయిని ప్రాణంగా ప్రేమించడమే అతడు చేసిన తప్పయ్యింది. అమ్మాయిని మరిచిపోయేందుకు డబ్బు ఆశ చూపినా లొంగని ఆ ప్రేమికుడి గుండెను ప్రియురాలి బంధువుల కత్తులు తూట్లు చేశాయి. మెదక్‌ మండలం ఖాజీపల్లి శివారులో దారుణ హత్యకు గురైన మోయిన్‌ఖాన్‌ ఉదంతంలో వారం రోజుల క్రితం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయమై బుధవారం మెదక్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్‌ సీఐ రామకృష్ణ పూర్తి వివరాలు వెల్లడించారు. మెదక్‌ పట్టణం దాయర వీధికి చెందిన మోయిన్‌ఖాన్‌(20) అనే విద్యార్థి ఈ నెల 2వ తేదీన మెదక్‌ మండలం ఖాజీపల్లి శివారులో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

పట్టణానికి చెందిన ఓ నగల వ్యాపారి కూతురును ప్రేమించినందుకే మోయిన్‌ను హతమార్చినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. మోయిన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ఐదుగురు కలిసి కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. అందులో నలుగురు మెదక్‌ పట్టణానికి చెందిన వారుకాగా ఒకరు ఓల్డ్‌సిటీ యాకుత్‌పురాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అనుమానితులుగా భావించిన మెదక్‌ పట్టణం అజాంçపురాకు చెందిన మహ్మద్‌ ఫాజిల్, సయ్యద్‌ మోజాంబీల్‌ అహ్మద్, హైదరాబాద్‌ పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన సయ్యద్‌ యహియాజాబ్రి అలియాస్‌ బాండ్‌లను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులను విచారించగా మరో ఇద్దరు మెదక్‌ పట్టణానికి చెందిన యువకులు సమీర్, షేఖ్‌ సత్తర్‌లు హత్యలో పొల్గొన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ప్రియురాలి బావ, సోదరుడు కీలకం..
నగల వ్యాపారి కూతురును మోయిన్‌ ప్రేమించాడు. డబ్బులు తీసుకొని అమ్మాయిని మరిచిపోవాలని సూచించినా మోయిన్‌ ప్రేమ డబ్బుకు లొంగలేదు. మరో ఆరు నెలలు అయితే తను ప్రేమించిన అమ్మాయి మేజర్‌ అవుతుందని అప్పుడు పెళ్లిచేసుకుంటానని మోయిన్‌ విసిరిన సవాల్‌ ఆ అమ్మాయి కుటుంబీకులకు మింగుడుపడలేదని, ఫేస్‌బుక్‌లో సైతం మోయిన్‌ చేసిన పోస్టులకు తట్టుకోలేక ఎలాగైనా మోయిన్‌ను హత్య చేయాలని ఆ అమ్మాయి బావ ఫాజిల్, చిన్న అన్న కలిసి మరో ముగ్గురి సహాయం తీసుకున్నారని తెలిపారు. ఓ కేసు విషయంలో ఈ నెల 2న మెదక్‌ కోర్టుకు çహాజరైన మోయిన్‌ రాత్రి 8గంటలకు హైదరాబాద్‌కు బస్‌లో బయలుదేరాడు.

ఈ విషయం గమనించిన నిందితులు 3320 కారులో జేబీఎస్‌కు వెళ్లి మోయిన్‌ పై దాడికి పాల్పడి అక్కడే చంపేద్దామనుకున్నారు. కాని ఉన్న ఊర్లో పరువుపోయినందున సొంత ఊర్లోనే చంపాలనుకొని తమ కారులో ఎక్కించుకొని మెదక్‌ మండలం ఖాజీపల్లి శివారులో ఉన్న తమ ఫాంహౌస్‌ వద్ద తీసుకెళ్లారు. అక్కడ మోయిన్‌ గుండె, వీపు భాగంలో కసిగా కత్తులతో పొడిచి, మర్మాంగాలపై రాళ్లను వేసి, ముఖాన్ని గుర్తుపట్టరాకుండా అతి కిరాతకంగా కొట్టి చంపేసినట్లు వివరించారు. హత్య జరిగిన ప్రదేశంలో మరో పాత ఇండికా కారును ఉంచినట్లు వివరించారు. హత్య చేసేందుకు రెండు కార్లు, కత్తి, చాకు, రెండు బైక్‌లను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా న్యాయబద్ధంగా విచారణ జరుగుతుందని, బస్‌ డ్రైవర్, కండక్టర్లతో పాటు మోయిన్‌ స్నేహితులను సైతం విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి, కానిస్టేబుల్‌ తాహెర్‌ తదితరులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top