చిన్నారుల జీవితాలను చిదిమేశారు

Minor Girls Save From Prostitution Scandal Tamil Nadu - Sakshi

వ్యభిచార బ్రోకర్ల చేతుల్లో నలిగిపోయిన ఇద్దరు బాలికలు

అంచలంచెలుగా అమ్మివేయడంతో వ్యభిచార కూపంలోకి

పలువురు మహిళలు సహా నిందితులకు కఠినశిక్ష విధిస్తూ కడలూరు కోర్టు తీర్పు

సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న కుళ్లూ, కుతంత్రాల గురించిఏమాత్రం తెలియని ఇద్దరు మైనర్‌ బాలికలు ఓ మహిళ స్వార్థానికిబలై పలుమార్లు అత్యాచారానికిగురయ్యారు. ఆ తరువాత కొందరు బ్రోకర్ల చేతులు మారుతూ వ్యభిచార కూపంలో చిక్కుకున్నారు. అంగట్లో సరుకులా అంచలంచెలుగాఅమ్మకానికి గురవుతూ పూర్తిస్థాయి వ్యభిచారులుగా మారిపోయారు. పలువురు మహిళలు సహా మొత్తం 23 మంది కలిసి ఆ ఇద్దరు బాలికల జీవితాలను చిదిమేశారు. నిందితుల పాపం పండడంతో మతబోధకునికి 30 ఏళ్ల జైలు, మరో ఇద్దరికి చెరీ నాలుగు యావజ్జీవాలు, ఒకరికి మూడు యావజ్జీవాలు, ఆరుగురికి తలా రెండు యావజ్జీవాలు ఇంకా మరికొంత మందికి జైలు శిక్ష విధిస్తూ కడలూరు కోర్టుసోమవారం తీర్పు చెప్పింది.

సాక్షి ప్రతినిది, చెన్నై : కడలూరు జిల్లా తిట్టకుడి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8,9 తరగతులు చదువుతున్న ఇద్దరు మైనర్‌ విద్యార్థినులు 2014 జూలై 11వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై అందుకున్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కడలూరులోని సతీష్‌కుమార్‌ (28) అనే వ్యభిచార బ్రోకర్‌ వద్ద చిక్కుకున్నట్లు బయటపడింది. దీంతో ఇద్దరు బాలికలను పోలీసులు రక్షించి ప్రభుత్వ బాలికల శరణాలయానికి అప్పగించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలికలు తమ పాఠశాలకు సమీపంలోని చిల్లరదుకాణానికి వెళ్లి చిరుతిళ్లు కొనుక్కోవడం అలవాటు. ఇలా ఒకసారి వెళ్లినపుడు దుకాణ యజమాని ధనలక్ష్మి.. ఆనందరాజ్‌ అనే స్నేహితునితో అత్యంత సన్నిహితంగా ఉండడం బాలిక చూసింది. ఈ విషయం బయట ఎక్కడ చెబుతుందోనని కంగారుపడిన ధనలక్ష్మి ఆ బాలికను ఆనందరాజ్‌ వద్దకు బెదిరించి పంపించింది.

అతడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాలను గోప్యంగా ఉంచకుంటే నీ గురించి తల్లిదండ్రులకు, పాఠశాలలో చెబుతాను అని లొంగదీసుకుంది. అంతేగాక మరో బాలికను తీసుకురావాలని బెదిరించింది. ధనలక్ష్మి మాటలకు భయపడిన బాలిక తన క్లాస్‌మేట్‌ను తీసుకొచ్చింది. ఇద్దరు బాలికలను తన భర్త సెంథిల్‌కుమార్, స్నేహితుడు ఆనందరాజ్‌ల వద్దకు పంపింది. అంతేగాక తిట్టకుడిలోని అరుల్‌దాస్‌ (60) అనే మతబోధకుడు సైతం ఇద్దరు మైనర్‌ బాలికల జీవితాలతో ఆటలాడుకున్నాడు. ఈ వ్యహారాలను పసిగట్టిన లక్ష్మీ అనే మరో మహిళ బాలికలను బెదిరించి వ్యభిచారంలోకి దింపింది. కొన్ని రోజుల తరువాత విరుదాచలంలో వ్యభిచార గృహం నడుపుతున్న కళా అనే మహిళకు ఇద్దరు బాలికలను రూ.5వేలకు అమ్మివేసింది. కళ ఆ ఇద్దరు బాలికలను అదే ఊరికి చెందిన జమీనా అనే మహిళకు రూ.25వేలకు అమ్మి సొమ్ము చేసుకుంది. వడలూరుకు చెందిన సతీష్‌కుమార్‌ జమీనా నుంచి రూ.25వేలకు వారిని కొనుక్కున్నాడు. సదరు సతీష్‌కుమార్‌ ఇద్దరు బాలికలను పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం తదితర అనేక ప్రాంతాలకు తిప్పుతూ వ్యభిచారం చేయించాడు. ఇద్దరు మైనర్‌ బాలికల చేత వ్యభిచారం చేయించిన, అత్యాచారానికి పాల్పడిన నేరంపై మతబోధకుడు అరుళ్‌దాస్, లక్ష్మి, కళ, జమీనా, సతీష్‌కుమార్‌లను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. 2016 జూలై 4వ తేదీనఈ కేసు విచారణ సీబీసీఐడీ చేతుల్లోకి వెళ్లింది. బాలికలను అనేక ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం చేయించిన వివిధ జిల్లాలకు చెందిన మరో 23 మంది బ్రోకర్ల పేర్లు  సీబీఐ విచారణలో బయటడ్డాయి. నిందితుల్లో ఆరుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా నిందితుల్లో మహాలక్ష్మి అనే మహిళ మినహా 16 మందిపై నేరం నిరూపితం కావడంతో కడలూరు కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

చారిత్రాత్మకమైన కఠిన శిక్షలు
మత బోధకుడు అరుళ్‌దాస్‌కు 30 ఏళ్ల జైలు, రూ.5లక్షల జరిమానా, ఆనందరాజ్, బాలసుబ్రమణియన్‌లకు చెరీ నాలుగు యావజ్జీవాలు, సెల్వరాజ్‌ అనే వ్యక్తికి మూడు యావజ్జీవాలు, ఆరుగురికి తలా రెండు యావజ్జీవాలుగా శిక్ష పడింది. అలాగే కళ (48), ధనలక్ష్మి (43), ఫాతిమా (35), శ్రీధర్‌ (23), మోహన్‌రాజ్, మదివానన్‌ తదితర ఆరుగురికి రెండు యావజ్జీవ శిక్షలు విధించింది. అంతేగాక, కళ, ధనలక్ష్మి, ఫాతిమా, శ్రీధర్‌...ఈ నలుగురు మరో 42 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారికి సైతం కోర్టు తగిన శిక్ష వేసింది. ఇద్దరు బాధిత బాలికలకు చెరీ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top