పెళ్లికి వెళ్తుంటే.. ఎదురొచ్చిన మృత్యువు!

Minivan Auto Accident In Prakasam - Sakshi

చీమకుర్తి రూరల్‌ (ప్రకాశం): బావమరిది పెళ్లికి కుటుంబ సభ్యులంతా పిల్లలతో కలిసి ఆటోలో బయల్దేరారు. మృత్యువు రూపంలో ఎదురొచ్చిన మినీవ్యాన్‌ ఆటోను ఢీకొనడంతో తాతా మనవళ్లు మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రొద్దుటూరి మోక్షజ్ఞ (6) అక్కడికక్కడే ఆటోలో ఇరుక్కొని మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రొద్దుటూరి బాబులు (50), బాలాజీ(3)  మృతి చెందారు.  మిగిలిన నలుగురూ తీవ్ర గాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం సంతనూతలపాడు మండలం ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలోని కర్నూల్‌ రోడ్డుపై బుధవారం ఉదయం జరిగింది.  ఈ ఘటనలో బాధితులంతా ఒంగోలు శర్మా కాలేజీకి సమీపంలోని సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు శర్మా కాలేజీకి సమీపంలో నివాసం ఉండే ప్రొద్దుటూరి శ్రీకాంత్‌ తన ఆటోలో తండ్రి బాబులు, ఇద్దరు కుమారులు, భార్య ఇతర బంధువులతో కలిసి ఉదయాన్నే దొనకొండలో బావమరిది పెళ్లికని బయల్దేరారు. సంతనూతలపాడు వద్ద మినీవ్యాన్‌ ఢీకొనడంతో ఆటో నడుపుతున్న శ్రీకాంత్‌కు రెండుకాళ్లు, చెయ్యి విరిగింది. శ్రీకాంత్‌ కుమారుడు మోక్షజ్ఞ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డవారిని రిమ్స్‌కు తరలించారు.

శ్రీకాంత్‌ తండ్రి బాబులు తలకు తీవ్రమైన గాయాలు కావడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్‌ రెండో కుమారుడు మూడేళ్ల బాలాజీ తలకు బలమైన గాయాలు కాడవంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో బాలాజీని గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయపడిన మిగిలిన వారిలో శ్రీకాంత్‌ తల్లి మీరమ్మ, భార్య మీరాబీ, అన్న కుమార్తె నిఖిలకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన మినీ వ్యాన్‌ డ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యాడు. ఒంగోలు రూరల్‌ సీఐ ఎం.మురళీకృష్ణ, స్థానిక ఎస్‌ఐ షేక్‌ ఖాసింబాషాతో కలిసి ఘటన స్థలాన్ని  పరిశీలించారు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top