వివాహిత మృతి.. గ్రామంలో ఉద్రిక్తత | Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత మృతి.. గ్రామంలో ఉద్రిక్తత

Sep 18 2018 3:11 PM | Updated on Nov 6 2018 8:08 PM

Married Woman Commits Suicide - Sakshi

కృష్ణవేణి మృతదేహం

వరికుంటపాడు: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో కోనేపల్లి కృష్ణవేణి (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతుండగా, ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన కోనేపల్లి వెంకట్రామిరెడ్డి ఐదేళ్ల క్రితం ఆదిలాబాద్‌ జిల్లాలో ఎచ్చెర్లలో బేల్దారి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన కృష్ణవేణి కుటుంబం ఆ ప్రాంతంలో బేల్తారి పనులు చేసేవారు. వెంకట్రామిరెడ్డి కృష్ణవేణితో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నాడు.

వారికి మూడేళ్ల హిమాయత్‌రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. ఏడాదిన్నర క్రితం వెంకట్రామిరెడ్డి భార్యను తన స్వగ్రామమైన తిమ్మారెడ్డిపల్లిలోని కుటుంబసభ్యుల వద్ద వదిలి ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. కొంత కాలానికి కృష్ణవేణిని ఆమె భర్త కుటుంబసభ్యులు ఇంటినుంచి గెంటివేశారు. దీంతో ఆమె బెంగళూరులోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. వారంరోజుల క్రితం వెంకట్రామిరెడ్డి సౌదీ నుంచి వచ్చాడు. ఆదివారం ఉదయం కృష్ణవేణి అత్తవారి ఇంటికి వచ్చింది. అదేరోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆమె ఉరేసుకుని చనిపోయినట్లుగా కుటుంబసభ్యులు ఇరుగుపొరుగు వారికి చెప్పారు. దీంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి కృష్ణవేణి శవాన్ని పరిశీలించి హత్య చేసినట్లుగా అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉదయగిరి సీఐ ఎంవీ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి వెళ్లారు.

రాళ్లతో దాడి
సోమవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబసభ్యులను అరెస్ట్‌ చేసి మృతరాలి బంధువులు వచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళితే ఒప్పుకోమని చెప్పారు. ఓ దశలో పోలీసుల వైఖరిపై గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆ ఇంటిపై రాళ్లతో దాడిచేశారు. విషయం తెలుసుకున్న కావలి డీఎస్పీ రఘు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగారు. రాత్రి పొద్దుపోయే వరకూ మృతదేహాన్ని గ్రామస్తులు తీసుకెళ్లనివ్వలేదు. పెద్దసంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. తహసీల్దార్‌ జి.శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా మృతిరాలి భర్త, అత్తామామ, బావ, తోడికోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement