భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని.. | Man Suicide In Psr Nellore District | Sakshi
Sakshi News home page

భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..

Jul 5 2019 10:03 AM | Updated on Jul 5 2019 10:04 AM

Man Suicide In Psr Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు : భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందనే అవమానంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతపేట మెట్లరేవులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంతపేట పోలీసుల సమాచారం మేరకు.. మెట్లరేవుకు చెందిన శివకుమార్‌ (34) ఇనుప సామాన్ల విక్రయ వ్యాపారి. ఆయనకు సుమారు 12 ఏళ్ల క్రితం వెంకటగిరి మండలానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఆర్నెల్ల క్రితం శివకుమార్‌ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు.

ఈ క్రమంలో భార్య అదే ప్రాంతానికి చెందిన కిశోర్‌తో సన్నిహితంగా మెలగసాగారు. గమనించిన అత్త ప్రభావతి పలుమార్లు ఆమెను మందలించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రభావతి తన కోడలు, కిశోర్‌ను మందలించి తన కుమారుడి కాపురాన్ని చక్కదిద్దాలని కోరారు. దీంతో పోలీసులు వారిద్దర్నీ పిలిచి మందలించారు. విషయం తెలుసుకున్న శివకుమార్‌ మనస్థాపానికి గురై తన ఇంటి పైభాగంలో ఉన్న గదిలో ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన ప్రభావతికి కుమారుడు కనిపించకపోవడంతో మేడపై ఉన్న గదికి వెళ్లిచూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి హుటాహుటిన కుమారుడ్ని నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. శివకుమార్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement