పట్టణం నడిబొడ్డున దారుణ హత్య | Man Murdered Brutally In Garividi | Sakshi
Sakshi News home page

పట్టణం నడిబొడ్డున దారుణ హత్య

Apr 29 2019 10:29 AM | Updated on Apr 29 2019 10:29 AM

Man Murdered Brutally In Garividi - Sakshi

గరివిడి: పట్టణ నడిబొడ్డున దారుణ హత్య జరిగింది. ఇనుప రాడ్లతో ఓ ఇంటి యజమానిని కొట్టి చంపడం సంచలనం రేపింది. శనివారం అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన తమ్మిన చినబాబు (55) భార్య విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, సుష్మితతో కలిసి గరివిడిలో నివాసముంటున్నారు. శనివారం అర్దరాత్రి ఒంటి గంట సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చినబాబు ఇంటి డాబాపైకి వెళ్లగా కొంతమంది దుండగులు వచ్చి ఇనుపరాడ్లతో చినబాబుపై దాడి చేశారు. దీంతో ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు రాగా వారిపై కూడా దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించారు. వెంటనే వారు ఇంటిలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకోగా... దుండగులు తలుపులు గట్టిగా కొట్టారు. ఎంతకీ తలుపులు రాకపోవడంతో వారంతా అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు డాబాపైకి వెళ్లి చూడగా చినబాబు విగతజీవిగా పడి ఉన్నాడు. ఇదిలా ఉంటే దుండగులే చినబాబు ఇంటి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఉంటారని అనుమా నం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు సేకరించిన క్లూస్‌ టీమ్‌..
హత్య విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ గౌతమీశాలి, సీఐ రాజులనాయుడు, ఎస్సై పి. నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌టీమ్‌ సభ్యులు కూడా వచ్చి వివరాలు సేకరించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నా అల్లుడే చంపాడు : మృతుడి భార్య
నా భర్తను అల్లుడు రమేష్‌పాండే చంపాడని మృతుడి భార్య విజయలక్ష్మి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెద్దమ్మాయి మౌనిక చదువు కోసం కాకినాడలో ఉన్నప్పుడు అక్కడే హోట్‌ల్‌లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్‌పాండేతో పరిచయం అయిందన్నారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో రమేష్‌పాండేతో పెళ్లి చేశామని చెప్పింది. అయితే వివాహం జరిగిన అనంతరం తమ అల్లుడు నిత్యం కుమార్తెను వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కుమార్తెను తమ దగ్గరకు తీసుకొచ్చామని.. అప్పటి నుంచి అల్లుడు తమను వేధిస్తున్నాడని తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పింది. అయితే కిరాయి రౌడీలతో వచ్చి హత్య చేస్తాడని ఊహించలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement