ఆరిన మరో ‘జ్యోతి’

Man Killed Young Woman In Guntur Tenali - Sakshi

కుమారుడి వయసున్న యువతిపై మృగాడి కన్ను

ఆమెకు పెళ్లి సంబంధం కుదరడంతో హతమార్చిన వైనం

తన కుమారుడి వయసున్న యువతి నిండు ప్రాణాలను ఆ మానవ మృగం బలి తీసుకుంది. ఆమెకు పెళ్లి కుదరడాన్ని తట్టుకోలేకపోయింది. తనకు దక్కని ఆమె ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో గొంతునులిమి, పీక కోసి హతమార్చింది. పెళ్లి సంబంధం కోసం ఏలూరు వెళ్లిన తల్లిదండ్రులు తమ బిడ్డ హత్యకుగురైందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు.

తెనాలి రూరల్‌: గుంటూరు జిల్లాలోని రాజధాని పరిధిలో ప్రేమికుడి వెంట వెళ్లిన నేరానికి ప్రాణాలు కోల్పోయిన జ్యోతి హత్య కేసులో వాస్తవాలు ఇంకా వెలుగు చూడక ముందే.. తెనాలిలో ఓ మృగాడి ఘాతుకానికి మరో ‘జ్యోతి’ కొడిగట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఆ మానవ మృగం..నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో పనిచేసే వీరికి కుమారుడు ప్రవీణ్‌ అలియాస్‌ నాని, కుమార్తె శ్రీజ్యోతి (20) ఉన్నారు. ప్రవీణ్‌ ఆటోనగర్లో స్టీలు కంపెనీలో పనిచేస్తుండగా, పదోతరగతి వరకు చదివిన శ్రీజ్యోతి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్‌ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు. ప్రవీణ్‌ ఆటోనగర్‌ వెళ్లాడు.

శ్రీజ్యోతి తండ్రి సుధాకర్‌ది స్వస్థలం భట్టిప్రోలు. అదే ఊరికి చెందిన నేతికుంట్ల సత్యనారాయణ(42)తో స్నేహం కుదిరింది. తన కొడుకుతోపాటు అదే ఈడు వాళ్లయిన సుధాకర్‌ పిల్లలనూ సత్యనారాయణ ఆడిస్తుండేవాడు. ఏడెనిమిదేళ్ల క్రితం వ్యాపారంలో నష్టపోయిన సుధాకర్‌ ఉపాధి కోసం తెనాలికి వచ్చేసి సాలిపేటలో అద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు సత్యనారాయణ కూడా కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి రైస్‌కాలనీలో నివసించసాగాడు. కుటుంబ వివాదాల కారణంగా సత్యనారాయణ ఒంటరిగా జీవిస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అన్ని అవసరాలకు సుధాకర్‌ కుటుబానికి ఆసరాగా ఉంటూ వచ్చాడు. అయితే  తన కుమారుడి వయస్సున్న శ్రీజ్యోతిపై కన్నేసిన సత్యనారాయణ ఆమెను వివాహం చేసుకుంటానని ఎవరి చేతనో తల్లిదండ్రులను అడిగించాడు. ఎందుకలా అడిగారని సుధాకర్‌ దంపతులు అతడిని నిలదీయగా..‘నేనెందుకు అన్నాను..చిన్నపిల్లకదా..సరదాగా అన్నాను’ అంటూ సత్యనారాయణ మాట దాటేశాడు.

 ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషనుకు వచ్చిన మృతురాలి తలిదండ్రులు బిట్రా సుధాకర్, దుర్గాభవాని  
ఆ తర్వా త కొద్దిరోజులకే ‘శ్రీజ్యోతికి పెళ్లి చేయండి..అవసరమైతే ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను’ అంటూ హామీనిచ్చాడు. అతని మాటలు నమ్మిన శ్రీజ్యోతి తల్లిదండ్రులు ఏలూరులో చూసిన పెళ్లి సంబంధం దాదాపు ఖరారైనట్టేనని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సత్యనారాయణకు ఫోనులో చెప్పారు. దీంతో ఆమె తనకు దక్కదని భావించిన సత్యనారాయణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిని హత్య చేసి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపేటలోని సుధాకర్‌ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీజ్యోతి మృతదేహం కనిపించింది. గొంతు నులిమి కూరగాయలు కోసుకునే కత్తితో పీక కోసినట్టు గమనించారు. నిందితుడిని పోలీస్‌స్టేషనుకు తరలించి..ఏలూరు వెళ్లిన తలిదండ్రులకు వన్‌టౌన్‌ సీఐ మరీదు శ్రీనివాసరావు సమాచారం అందించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న ఆ దంపతులు, విగత జీవురాలై పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top