ఫోన్‌లో పరిచయాలు.. ఆపై బ్లాక్‌మెయిల్‌

Man Held in Cyber and Blackmail Case SPSR Nellore - Sakshi

విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫొటోల సేకరణ

కోర్కె తీర్చకపోతే ఇంటర్నెట్‌లో పోస్టు చేస్తానని బెదిరింపులు

దిశ పోలీసులు కేసు నమోదు.. నిందితుడి అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): స్నేహితులు, తెలిసిన వారి ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్‌నంబర్లు సేకరించి వారితో మాటలు కలుపుతాడు. ఆపై వ్యక్తిగత, ప్రైవేట్‌ ఫొటోలను సేకరించి తన కోర్కె తీర్చమని లేకపోతే వాటిని అంతర్జాలంలో పోస్టుచేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వారిని లొంగదీసుకుని కోర్కె తీర్చుకోసాగాడు. ఓ యువతి ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. దిశ పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ యు.నాగరాజు సమాచారం మేరకు.. వింజమూరుకు చెందిన ప్రశాంత్‌ ఎమ్మెస్సీ చదివాడు. పరిచయస్తులు, స్నేహితుల ద్వారా విద్యార్థినులు, యువతులు, వివాహితల ఫోన్‌నంబర్లు సేకరించి వారితో పరిచయాలు పెంచుకుంటాడు. అనంతరం నీవంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వారిని తన వలలో చిక్కుకునేలా చేస్తాడు. వ్యక్తిగత, ప్రైవేట్‌ చిత్రాలు సేకరించి తన కోర్కె తీర్చాలని వారిపై ఒత్తిడి తెస్తాడు. మాట వినకపోతే ప్రైవేటు చిత్రాలను ఇంటర్నెట్‌లో పోస్టుచేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసి వారిని లొంగదీసుకుని తన వాంఛ తీర్చుకోసాగాడు.

అతని మాయలోపడి ఎందరో మహిళలు, యువతులు ఇబ్బందులు పడసాగారు. ఈ క్రమంలో ఉదయగిరికి చెందిన ఓ యువతి ప్రశాంత్‌ మోసాలపై దిశ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగరాజు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ఫోన్‌ పరిశీలించగా కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. మెయిల్‌లో మహిళలు, యువతుల నగ్నచిత్రాలు, చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను గుర్తించారు. ఎనిమిది మంది అమ్మాయిలను మోసం చేసిన ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారని డీఎస్పీ తెలిపారు. అతని ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల కల్లబొల్లి మాటలకు లొంగిపోయి వ్యక్తిగత చిత్రాలు షేర్‌ చేయవద్దని డీఎస్పీ ఈ సందర్భంగా మహిళలు, యువతులకు సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top