బిడ్డ చిరునవ్వు చూడకుండానే.. | Man Died Lorry Accident In Guntur | Sakshi
Sakshi News home page

బిడ్డ చిరునవ్వు చూడకుండానే..

Jun 8 2018 1:16 PM | Updated on Aug 24 2018 2:36 PM

Man Died Lorry Accident In Guntur - Sakshi

మృతుడు బత్తుల నాగరాజు

ముత్యాలంపాడు(దాచేపల్లి): రెండు నెలల బాబు.. ఆ బోసి నవ్వులు తండ్రి కళ్ల ముందు కదిలాడుతున్నాయి.. ఎప్పుడెప్పుడు మళ్లీ చూస్తానా..? బిడ్డను గుండెలపై పెట్టుకుని ఎప్పుడు లాలిస్తానా ? అని బయలుదేరాడు.. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించడంతో బిడ్డను చూడకుండానే అనంతలోకాల్లో కలిసిపోయాడు. గురువారం మండలంలోని ముత్యాలంపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తంగెడ గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు(25)కు మాచర్లలోని భవానీతో రెండేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి రెండు నెలల బాబు. భార్య బాలింత కావడంతో పుట్టింటి దగ్గర ఉంది. గురువారం తంగెడలో వ్యవసాయ పనులు చూసుకుని భార్య, బిడ్డను చూసేందుకు బియ్యం మూటతో బైక్‌పై బయలుదేరాడు. ముత్యాలంపాడుకు సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు లారీని వెంబడించి ఆపారు. నాగరాజు మృతి వార్త విని కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అద్దంకి వెంకటేశ్వర్లు  తెలిపారు. పొస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement