
వివేక్ (ఫైల్)
రసూల్‌పురా: అప్పుల బాధతోపాటు తల్లి మందలింపును భరించలేని ఓ యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి పోలీసుల సమాచారం మేరకు... చింతల్ గణేష్‌నగర్‌లో ఉండే వివేక్(24) మూడేళ్లుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న హోమ్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో కలెక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తీసుకున్న అప్పులు తీరకపోవడం, తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం మద్యాహ్నం తోటి ఉద్యోగులు శివ, అనిల్‌లకు మెసేజ్ పెట్టాడు. అనంతరం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్నేహితులు బోయిన్‌పల్లి ఆర్మీ క్వార్టర్స్ నుంచి చింతల్ వెళ్లే మార్గంలో ఉన్న చెట్ల మధ్యకు చేరుకున్నారు. అప్పటికే వివేక్ మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.