చెరువులో తేలిన ప్రేమజంట

Lovers Commits End Livs Families Reject Second Marriage Warangal - Sakshi

ఇళ్ల నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య

వరంగల్‌ రూరల్‌,పరకాల / నడికూడ / కమలాపూర్‌ : పదేళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది.. అప్పట్లో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో కుటుంబ సభ్యులు చూసిన సంబంధాలనే పెళ్లి చేసుకున్నారు... ఇంతలోనే మహిళ భర్త అనారోగ్యంతో మరణించగా మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమయాణం మొదలైంది. ఈ మేరకు రెండో పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో చెరువు కుంటలో దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.(ప్రేమ పెళ్లి.. దంపతుల ఆత్మహత్య)

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమాలాపూర్‌ మండలం అంబాలకు మంత్రి రమ్య(29), అదే గ్రామానికి చెందిన గండ్రకోట రాజు(30) పదేళ్ల క్రితం ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అయితే, పెళ్లికి అడ్డంకులు రావడంతో పోలీసులను ఆశ్రయించగా పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం రమ్యకు వెలగొండకు చెందిన తిరుపతితో వివాహం జరిపించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి రమ్య భర్త ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లగా రమ్య అంబాలలోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇక రాజు వివాహం కూడా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చల్వాయికి చెందిన మహిళలతో జరగగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, పది నెలల క్రితం రమ్య భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.

ఇంతలోనే హైదరాబాద్‌లో ఉంటున్న రాజు భార్యాపిల్లలతో కలిసి స్వగ్రామంలో ఇల్లు కట్టుకునేందుకు వచ్చాడు. ఇక్కడ మళ్లీ రమ్యతో ప్రేమాయణం మొదలుకాగా, రాజు భార్యతో పాటు రమ్య కుటుంబీకులు మందలించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం రమ్య, రాజు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుపై అనుమానంతో రమ్య కుటుంబీకులు కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ జరుపుతుండగానే ధర్మారం శివారులోని చెరువుకుంటలో మృతదేహాలు తేలాయి. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాలను తీయించి ఆస్పత్రులకు తరలించారు. కాగా, వీరిద్దరూ ఆటోలో చెరువు వద్దకు వచ్చారని కేసు విచారణ జరుపుతున్నామని పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top