విషాదాంతం

Love Couple Commits Suicide in Vizianagaram - Sakshi

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య 

రెండు రోజుల్లో ఆమె పెళ్లి... ఇంతలోనే ఘోరం

పెద్దలను ఎదిరించలేక ప్రియుడితో కలసి ప్రాణత్యాగం  

జగన్నాథపురంలో రెండుకుటుంబాల్లో అలముకున్న విషాదం

వాళ్లిద్దరూ చదువుకున్నవారే. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కలకాలం సంతోషంగా బతకాలనుకున్నారు. కానీ వారికి కులం అడ్డం వచ్చింది. ఒకరు ఎస్సీ కులానికి చెందినవారైతే... ఇంకొకరు బీసీ(తెలుకల) కులానికి చెందిన వారు. ఇద్దరి మనసులు కలసినప్పటికీ... ఇద్దరి గుండెచప్పుడు ఒక్కటైనప్పటికీ... ఒకరిపై ఒకరికి హద్దులు లేని ప్రేమ ఉన్నప్పటికీ... కులం అడ్డుగోడగా నిలిచింది. విషయం తెలిస్తే తమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించరనీ... వారికి తెలియకుండానే ప్రేమించుకో సాగారు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారొకటి తలిస్తే దైవమొకటి తలచింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం కుదిర్చారు. బుధవారమే ఆ పెళ్లి జరగాల్సి ఉంది. చేసేది లేక ఆమె ప్రేమికుడితో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది.

విజయనగరం, పార్వతీపురం/కొమరాడ/బొబ్బిలి: బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన పాలకొండ కృష్ణవేణి(18) ఇంటర్మీడియెట్‌ చదువుకుంది. ఈమె తల్లిదండ్రులు ప్రసాద్, సునీత కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చింతల బెలగాం చంద్రశేఖర్‌ (20) ఇంటర్మీడియట్‌పూర్తిచేసి రాజా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి తండ్రి లేడు. తల్లి కళ మాత్రమే ఉంది. కృష్ణవేణి, చంద్రశేఖర్‌ ప్రేమించుకున్నారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకుందా మనుకున్నారు. కానీ ఇంతలోనే కృష్ణవేణి తల్లిదండ్రులు ఆమెకు వివాహం ఖాయం చేశారు. గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కురమాన చిన్నారావు(చంటి) అనే యువకునితో వివాహం నిశ్చయం చేశారు. చిన్నారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందున తన కుమార్తె భవిష్యత్‌ బాగుంటుందని భావించారు. జనవరి 23వ తేదీ న వీరి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేశారు. కానీ ఆమె మనసు అంగీకరించలేదే మో... చావైనా బతుకైనా ప్రేమించిన వ్యక్తితోనే అనుకున్నదేమో... తల్లిదండ్రులు కుదిర్చిన వివా హం చేసుకోకుండా ప్రేమించిన యువకుడితో కలసి కొమరాడ మండలం శివిని గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

రోదిస్తున్న మృతురాలి తల్లి

కాబోయే భర్తతో వెళ్లి అదృశ్యం
పండుగకోసం కోటిఆశలతో కాబోయే భార్యను చూసేందుకు చిన్నారావు జగన్నాథపురం వచ్చాడు. అత్తవారింట్లో సరదాగా గడిపాడు. ఆదివారం తన స్నేహితురాలి పెళ్లికి తీసుకెళ్లమని కోరితే సంబరంగా ఆమెను ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. పార్వతీపురం వచ్చేసరికి లఘుశంక తీర్చుకుంటానని చెప్పగా బండి ఆపాడు. కానీ అలా వెళ్లిన ఆమె ఎంతకూ రాకపోయేసరికి చుట్టుపక్కల వెతికి చివరికి పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎస్‌ఐ మహేష్, రైల్వే పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులు విషయం తెలుసుకొని రైలు పట్టాలు దగ్గరకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి సునీత, తండ్రి పీటల మీద కూర్చొవల్సిన తన కుమార్తె పెళ్లికి కొద్ది గంటల ముందే రైలు పట్టాలపై శవమై కన్పించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు, తల్లి కళ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కృష్ణవేణిని వివాహం చేసుకోవాల్సి న కొత్తూరుకు చెందిన చిన్నారావు కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. కార్డులు పంచి బంధువులును ఆహ్వానించి  ఒక రోజు తరువాత వివాహం జరగాల్సి ఉండగా ఇంతలో ఈ రకంగా సమస్య వచ్చి పడడంతో వారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top