కేసు క్లోజ్‌!

Lok Adalat Case Closed With Compromise - Sakshi

మహంకాళి పరిధిలో రూ.30 లక్షల దోపిడీ కేసు

ప్రధాన సూత్రధారినిపట్టుకోలేకపోయిన పోలీసులు

రాజీ కుదిరిస్తే డబ్బు తిరిగి ఇస్తానంటూ బేరాలు

లోక్‌ అదాలత్‌లో కేసు కాంప్రమైజ్‌ అయిన వైనం

సాక్షి, సిటీబ్యూరో: సిటీ పోలీసింగ్‌ పనితీరుపై ఓ మచ్చ ఈ కేసు.. తీవ్రమైన నేరంగా పరిగణించే దోపిడీ కేసులో పోలీసులు ‘రాజీ’పడ్డారు.. ప్రధాన సూత్రధారిని పట్టుకోలేకయిన బృందాలు అతడి ‘ఆఫర్‌’కు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.. కేసు రాజీ కావడంతో దోచుకుపోయిన డబ్బు తిరిగి ఇచ్చాడని తెలిసింది. ఫలితంగా మహంకాళి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న రూ.30 లక్షల దోపిడీ కేసు 60 రోజుల్లోపే ‘తేలిపోయింది’. ఈ అధికారుల తీరుపై న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నేరం జరిగింది మినహాయిస్తే ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేయడం, వీరిలో ఒకరిని హయత్‌నగర్‌ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకోవడం, కేసు రాజీ కావడం.. ఇవన్నీ అత్యంత రహస్యంగా జరగడం గమనార్హం. 

అసలేం జరిగింది?
సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌లో శ్రీనివాసవర్మ అనే వ్యక్తి రోహిత్‌ జ్యువెలర్స్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. బంగారు నగలను ఆర్డర్‌పై తయారు చేసి విక్రయించడం ఇతడి వ్యాపారం. ఈ దుకాణానికి ఎదురుగానే అనిల్‌ అనే వ్యాపారి నవ్‌కార్‌ జ్యువెలరీ షాపు నడుపుతున్నారు. అనిల్‌ నుంచి శ్రీనివాసవర్మకు నగల తయారీకి సంబంధించి కొంత మొత్తం రావాల్సి ఉంది. దీంతోపాటు మరికొంత బదులు ఇవ్వాల్సిందిగా శ్రీనివాసవర్మ కోరారు. గత ఏడాది నవంబర్‌ 12 రాత్రి ఈ నగదు సిద్ధం చేసిన అనిల్‌.. వర్మకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడి వద్ద పని చేసే రూపారామ్‌ అనే రాజస్థానీ డబ్బు తీసుకురావడానికి వెళ్లాడు. అనిల్‌ నుంచి రూ.30 లక్షలు తీసుకున్న రూపారామ్‌ మొదటి అంతస్తు నుంచి కిందికి వస్తుండగా మెట్లపైకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అతడి కళ్లలో పెప్పర్‌ స్ప్రే కొట్టి డబ్బు బ్యాగ్‌ దోచుకున్నాడు. అప్పటికే కింద ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉన్న మరొకరితో కలిసి పారిపోయాడు. 

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..
ఈ దోపిడీకి సంబంధించి శ్రీనివాసవర్మ ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసుస్టేషన్‌లో అదే రోజు రాత్రి కేసు (ఎఫ్‌ఐఆర్‌ నెం.217/2019) నమోదైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా నిందితులు సమీపంలో ఉన్న ఓ బేకరీ గల్లీ నుంచి బయటకు వచ్చి దాదాపు అర్ధగంట పాటు ఆ పరిసరాల్లోనే తచ్చాడినట్లు గుర్తించారు. ఆపై మహంకాళి దేవాలయం ముందు నుంచి నవ్‌కార్‌ జ్యువెలర్స్‌ వద్దకు వచ్చినట్లు కనిపించింది. ఒకరు వాహనంపైనే ఉండగా.. మరొకరు వచ్చి డబ్బు దోచుకుపోయినట్లు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రూపారామ్‌ పాత్రను పోలీసులు అనుమానించారు. నేరగాడు నేరుగా డబ్బు బ్యాగ్‌తో వస్తున్న అతడి వద్దకే వెళ్లడం.. కళ్లలో పెప్పర్‌ స్ప్రే కొట్టి నగదు సంచీ లాక్కుంటున్న ఇతడు అరవకపోవడం తదితర కారణాలతో ఈ కోణంపై దృష్టి పెట్టిన పోలీసులు రూపారామ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.  

ఆ సమాచారంతోనే దోపిడీ..
ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నాళ్లుగా శ్రీనివాసవర్మ వద్ద పని చేస్తున్న రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాకు చెందిన రూపారామ్‌కు అతడి ఆర్థిక లావాదేవీలు తెలిశాయి. ఈ నేపథ్యంలో భారీ మొత్త దోచుకుని పరారవ్వాలని నిర్ణయించుకున్న అతగాడు ఈ విషయాన్ని తమ ప్రాంతానికే చెందిన సన్నిహితుడు భజన్‌లాల్‌కు చెప్పాడు. అంగీకరించిన అతడు మంగీలాల్‌ను తీసుకుని నరానికి చేరుకున్నాడు. ఇద్దరూ బండ్లగూడలో ఉంటున్న కొందరు రాజస్థానీలతో కలిసి కొన్నాళ్లు నివసించి రూపారామ్‌ నుంచి సమాచారం కోసం వేచి చూశారు. దోపిడీకి స్కెచ్‌ వేయడం పూర్తయిన తర్వాత హయత్‌నగర్‌ ఠాణా పరిధి నుంచి ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి తీసుకువచ్చారు. దాన్ని వినియోగించిన దుండగులు రూపారామ్‌ ఇచ్చిన సమాచారంతోనే గత ఏడాది నవంబర్‌ 12 రాత్రి అతడి నుంచే రూ.30 లక్షల బ్యాగ్‌ లాక్కుపోయారు. ఎవరికీ అనుమానం రాకూడదని రూపారామ్‌ ఇక్కడే ఉండిపోయాడు.. మిగిలిన ఇద్దరూ వాహనాన్ని వదిలేసి తమ స్వస్థలానికి వెళ్లిపోయారు.  

పట్టుకోలేకపోయిన పోలీసులు..
ఈ కేసులో భజన్‌లాల్, మంగీలాల్‌లను పట్టుకోవడానికి రెండుమూడు విడతల్లో ప్రత్యేక బృందాలు రాజస్థాన్‌కు వెళ్లాయి. బర్మేర్‌ జిల్లాలో గాలించిన అధికారులు భజన్‌లాల్‌ను మాత్రం పట్టుకోగలిగారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే మంగీలాల్‌ ప్రధాన సూత్రధారని, దోచుకున్న డబ్బు మొత్తం అతడి వద్దే ఉందని తేలింది. దీంతో మంగీలాల్‌ను పట్టుకోవడానికి మరికొన్ని ప్రయత్నాలు జరిగాయి. బర్మేర్‌ జిల్లా పాకిస్థాన్‌ బోర్డర్‌కు సమీపంలో ఉండటంతో పోలీసులు రాక పసిగట్టిన ప్రతిసారీ అతడు సరిహద్దుల వద్దకు వెళ్లి తప్పించుకున్నాడు. ఓ దశలో అతడి గ్రామానికి చెందిన పెద్దలతో ‘కేసు రాజీ చేయిస్తే డబ్బు తిరిగి ఇచ్చేస్తా’నంటూ బేరసారాలకు దిగాడు. దీనికి తొలుత ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాన సూత్రధారి చిక్కకుండానే, డబ్బు రికవరీ కాకుండానే కేసు దర్యాప్తు ముగిసింది. హయత్‌నగర్‌ పోలీసులు తమ పరిధిలోని బైక్‌ చోరీ కేసులో భజన్‌లాల్‌ను అరెస్టు చేశారు. ఉన్నపళంగా మహంకాళి పరిధిలో నమోదైన దోపిడీ కేసు లోక్‌ అదాలత్‌లో రాజీ అయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top