సల్మాన్‌కే వార్నింగ్‌ ఇచ్చాడు

Lawrence bishnoi group sampat nehra warns salman khan - Sakshi

వెలుగులోకి వస్తున్న సంపత్‌ నెహ్రా కార్యకలాపాలు 

కోర్టులో చంపుతానంటూ సల్మాన్‌ఖాన్‌కు హెచ్చరిక 

ఇద్దరు విద్యార్థులతో కలిసి గోకుల్‌ ఫ్లాట్స్‌లో మకాం 

సాక్షి, హైదరాబాద్‌ : సైబరాబాద్, మియాపూర్‌ ఠాణా పరిధిలోని గోకుల్‌ ప్లాట్స్‌లో హర్యానా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న ఇతను బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టలేదు. అతడి నుంచి డబ్బులు వసూలు చేయడానికి పథకం పన్ని వార్నింగ్‌ ఇచ్చాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో రాజస్థాన్‌ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రధానంగా సోషల్‌మీడియా వేదికగానే ఇతడి దందాలు నడిచాయని పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్‌ తండ్రి రామ్‌చంద్ర పోలీసు అధికారి. చండీఘడ్‌ పోలీసు విభాగంలో అసిస్టెంట్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. పంజాబ్‌ యూనివర్శిటీ పరిధిలోని
డీఏవీ కాలేజీలో బీఏ పూర్తి చేసిన సంపత్‌ పంజాబ్‌ యూనివర్శిటీ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. విద్యార్థి దశలోనే ఘర్షణలకు దిగి, బెదిరింపులకు పాల్పడి పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. జోధ్‌పూర్‌లో నమోదైన ఓ కేసులో అరెస్టైన సంపత్‌కు జైలులో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో పరిచయమై అతడి అనుచరుడిగా మారాడు.

తమ సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్, చండీఘడ్‌లకూ విస్తరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరవుతున్న సల్మాన్‌ ఖాన్‌ను ఈ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసింది. ఆయన నుంచి అందినకాడికి దండుకోవాలని భావించిన బిష్ణోయ్‌ బెదిరించాల్సిందిగా సంపత్‌ను ఆదేశించాడు. దీంతో సోషల్‌మీడియా ద్వారా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగిన సంపత్‌ జోధ్‌పూర్‌ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ సల్మాన్‌కు గతేడాది వార్నింగ్‌ ఇచ్చాడు. సంపత్‌కు రాజ్‌ఘర్‌ కోర్టు ఆవరణలో అజయ్‌ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపి హత్య చేసిన చరిత్ర ఉండటంతో ఈ వార్నింగ్‌ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్‌ పోలీసులు సల్మాన్‌ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఎక్కువగా సోషల్‌మీడియానే వాడుకునేది. బిష్ణోయ్‌ అరెస్టు తర్వాత ఆ గ్యాంగ్‌కు నేతృత్వం వహించిన సంపత్‌ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ పరోక్షంగా అనేక మందికి వార్నింగ్స్‌ ఇచ్చేవాడు.

వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నాలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌ విసిరిన సంపత్‌పై పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసులు ఉన్నాయి. అతడి కోసం పోలీసులు వేట ముమ్మరం చేయడంతో తన అనుచరుడి సహాయంతో సిటీకి మకాం మార్చాడు. దాదాపు నెల రోజుల క్రితం గోకుల్‌ ప్లాట్స్‌లోని ఓ అద్దె ఇంట్లో తన ఉనికి బయపడకుండా సాధారణ జీవితం పడిపాడు. ఎంబీఏ చదువుతున్నఇద్దరు విద్యార్థులతో కలిసి నిరుద్యోగి ముసుగులో నివసించాడు. నిత్యం సెల్‌ఫోన్‌లో చాటింగ్స్, ఫోన్లలో బిజీగా ఉండే సంపత్‌ ఓ గ్యాంగ్‌స్టర్‌ అన్న విషయం తమకు తెలియదని ఆ ఇద్దరు విద్యార్థులు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ విచారణలో వెల్లడించారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన ఎస్టీఎఫ్‌ అధికారులు ఫలితం లేకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లారు. సంపత్‌ ప్రధాన అనుచరులతో పాటు అతడి గర్ల్‌ఫ్రెండ్‌ హిసార్‌ సెల్‌ఫోన్లను ట్యాప్‌ చేశారు. దీంతో సంపత్‌ ఆచూకీ బయటపడటంతో సైబరాబాద్‌కు వచ్చి ఎస్‌ఓటీ సహాయం కోరారు. బుధవారం రంగంలోకి దిగిన టీమ్స్‌ తొలుత అతడి వద్ద మారణాయుధాలు ఉంటాయని అనుమానించారు. అతడు అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ సమీపంలో కాపుకాసిన పోలీసులు బుధవారం సాయంత్రం ఈవెనింగ్‌ వాక్‌కు వచ్చిన సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి ఫ్లాట్‌లో సోదాలు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top