డ్రైవర్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవడం వల్లే ప్రమాదం: యోగి

Kushinagar Accident Yogi Adityanath says Driver Fault - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కుశి నగర్‌లో పాఠశాల వ్యాన్‌ రైల్వే లెవెల్ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. వ్యాన్‌ డ్రైవర్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చారు.

అనంతరం సీఎం యోగీ మీడియాతో మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్‌ కూడా ఉన్నాయని తెలిపారు. అందువల్లే, క్రాసింగ్‌ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. డ్రైవర్‌... పాఠశాల నుంచే ఫోన్‌ మాట్లాడుతూ వ్యాన్‌ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌తో కూడా చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కాగా మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయలైనవారికి బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

చదవండి...ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top