
కేరళ మాజీ క్రికెటర్ జయమోహన్ తంపి (ఫైల్ ఫోటో)
సాక్షి, తిరువనంతపురం: కేరళ మాజీ రంజీ క్రికెటర్ కె.జయమోహన్ తంపి(64) హత్య కేసు మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఆయన కుమారుడు అశ్వినే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. ఈ మాజీ క్రికెటర్ సోమవారం అనుమానస్పద స్థితిలో ఇంట్లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆయన కొడుకు అశ్విన్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. (ఆస్పత్రి నుంచి పారిపోయి.. శవమై తేలాడు)
‘జయంత్ ఆయన కుమారుడు అశ్విన్‌లు ప్రతిరోజు ఇంట్లోనే మద్యం తాగే అలవాటు ఉంది. జయమోహన్ హత్యకు గురైన రోజు(శనివారం) కూడా వారు మద్యం సేవించారు. మరింత మద్యం కోసం తండ్రి డెబిట్ కార్డును ఉపయోగించడానికి అశ్విన్ ప్రయత్నించాడు. అయితే దీనికి జయమోహన్ అంగీకరించలేదు. దీంతో వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్దగొడవకు దారితీసింది. ఈ క్రమంలో జయమోహన్‌ను అశ్విన్ బలంగా తోసేయడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం అయింది. ఆ తర్వాత తండ్రి శవాన్ని పక్కకు పడేసి అక్కడే మరింత మద్యం సేవించి పడుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు. ఇక జయమోహన్ 1979-82 సమయంలో కేరళ తరుపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. (మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్)