నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..

Justice For Disha: 4 accused were killed in Police encounter  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అభం, శుభం తెలియని వెటర్నరీ వైద్యురాలు దిశపై దారుణానికి పాల్పడ్డ పదో రోజు నలుగురు మృగాళ్ల కథ ముగిసింది. దేశం నినదించిందే నిజమయింది. దిశపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు చివరకు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపై దాడిచేసేందుకు యత్నం చేశారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో నలుగురు మృగాళ్లు అక్కడిక్కడే  హతమయ్యారు.

గత నెల 27న దిశను నిందితులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. కేసులో తాము పట్టపడకుండా తప్పించుకునేందుకు..దిశను తగలబెట్టారు. నవంబర్ 28న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..29న షాద్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. నవంబర్ 30న నిందితులకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. చర్లపల్లి జైలుకు వారిని తరలించారు. ఈనెల 4న నిందితులను షాద్‌నగర్ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఘటనపై నిన్న నిందితులను సిట్‌ విచారించింది. విచారణలో భాగంగా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున మూడున్నర ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో గత రెండు రోజుల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్‌ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటించాయి.

మరోవైపు మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు అర్ధరాత్రి ప్రాంతంలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్‌గేట్‌ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. 

దిశను ముందు చూసిందెవరు..? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది..?.. తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల నుండి ఆయుధాలు లాక్కునేందుకు యత్నించారు. వీలుకాకపోవడంతో పక్కనే ఉన్న రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా మృతదేహాలకు సంఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

మరోవైపు నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో దిశ నివాసం వద్ద భద్రతను పెంచారు. ఒక ఎస్‌ఐ, ముగ్గురు మహిళా, నలుగురు పురుష కానిస్టేబుల్స్‌తో భద్రత ఏర్పాటు చేశారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించవద్దని స్పెషల్‌ టీమ్‌కు పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గుంపుగా వచ్చి ఎవరైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దిశ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇక దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.  నిందితులకు సరైన శిక్ష పడిందని మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. కళాశాలల విద్యార్థినుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దిశ ఆత్మకు శాంతి కలిగిందని, కామాంధుల ఎన్‌కౌంటర్‌తో జనజీవన స్రవంతిలో ఉన్న మానవ మృగాల గుండెల్లో దడ పుట్టించేలా ఉందని అన్నారు. టపాసులు పంచుతూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ‍్యక్తం చేశారు.

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

దిశ నిందితుల ఎన్కౌంటర్: బుల్లెట్ దాచుకోవాలని ఉంది

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం

దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ?

సాహో సజ్జనార్అంటూ ప్రశంసలు..

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం

బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top