‘రుణాల’ సూత్రధారి రాజేష్‌! | Hyderabad Police Hunting For Call Center Rajesh | Sakshi
Sakshi News home page

‘రుణాల’ సూత్రధారి రాజేష్‌!

Mar 27 2019 6:55 AM | Updated on Mar 28 2019 12:50 PM

Hyderabad Police Hunting For Call Center Rajesh - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఫోన్‌కాల్స్‌ ద్వారా ఎర వేసి, తక్కువ వడ్డీకి రుణాలంటూ ఆశపెట్టి అందినకాడికి దండుకునే కాల్‌ సెంటర్‌ నేరాలను చెన్నై వాసి రాజేష్‌ సూత్రధారిగా తేలింది. అతడి నేతృత్వంలో సిటీలోని రెండు కాల్‌ సెంటర్లు పని చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఎలైట్‌ కనెక్ట్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో, మహేంద్ర ఫైనాన్స్‌ ద్వారా రుణాలంటూ మోసాలు చేయడంతో ఇతడిపై గతంలో తమిళనాడులో కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టైన అతను బెయిల్‌పై బయటకు వచ్చి హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాజేష్‌ కోసం సిటీ నుంచి వెళ్లిన రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో రెండు కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసిన ఈ ముఠా 600 మంది నుంచి రూ. 25 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న చెన్నైకి చెందిన రాజేష్‌ ఈ రెండు సెంటర్ల నిర్వాహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేష్‌తో పాటు మరో నలుగురిపై తమిళనాడులోని తిరుచ్చి పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది కేసు నమోదైంది, అప్పట్లో అరెస్టైన ఈ గ్యాంగ్‌ కొన్నాళ్ల పాటు జైల్లో ఉంది. ఆ ప్రాంతంతో పాటు చెన్నైలోనూ ఇదే తరహాలో మహేంద్ర ఫైనాన్స్‌ సంస్థ పేరుతో రుణాలు ఇప్పిస్తామంటూ అనేక మందికి ఫోన్లు చేయించి, వారి బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకొని, ఆయా ఖాతాల్లో ఉన్న డబ్బును కాజేశారు.

తమిళనాడులో కాల్‌ సెంటర్‌ నిర్వహణకు వేరే రాష్ట్రానికి చెందిన సిమ్‌కార్డులను ఉపయోగించారు. ఇలా 8 నెలల పాటు తమిళనాడులోని చెన్నై, తిరుచ్చిల్లో కాల్‌సెంటర్లు నిర్వహించారు, అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందడంతో అరెస్టైన రాజేష్‌ గ్యాంగ్‌ కొన్నాళ్ల పాటు జైల్లో ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తాత్కాలికంగా తమిళనాడులో దందాకు బ్రేక్‌ వేసింది. వారి దృష్టి హైదరాబాద్‌పై పడటంతో ఇక్కడ కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని పథకం పన్నారు. బంజారాహిల్స్, పంజాగుట్టలోని కాల్‌సెంటర్లలో మేనేజర్లుగా పనిచేస్తున్న ఎ.ఆశకుమారీ, రంగస్వామి గోపి రాజేష్‌కు టచ్‌లో ఉంటూ టెలీ కాలర్స్‌తో చేయించేవారు. రాజేష్‌ చెన్నైలోనే ఉంటూ ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. శనివారం ఈ రెండు కాల్‌సెంటర్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు మరో 54 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్‌ అండ్‌ కో సిటీ నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళనాడులో మకాం వేసిన రెండు ప్రత్యేక బృందాలు వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

ఈ  ముఠా గతంలో ఎక్కడకెక్కడ ఇలాంటి కాల్‌సెంటర్లు నిర్వహించింది? ఎంతమందిని మోసం చేశారు? నగదు ఎక్కడకు వెళ్లింది? తదితర విషయాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టి పెట్టారు. బాధితుల డబ్బు మళ్లించుకుని వాలెట్స్‌ నుంచి వివరాలు వస్తే దీనిపై ఓ స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. నగరంలోని రెండు కాల్‌సెంటర్స్‌లో పనిచేసే సిబ్బందికి రాజేష్‌ చెన్నై నుంచే  సిమ్‌కార్డులను  పంపేవాడు. ఈ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌ అందుకునే బాధితులు అవి చెన్నై నుంచి వచ్చినట్లే భావించేవారు. రుణాలు కావాలా అంటూ ఫోన్‌ చేసినప్పుడు, ఎవరైనా తమకు అవసరమని చెప్పడంతోనే ఆనెంబర్లను వేరుగా రాసుకొని, లక్ష్యం పూర్తయ్యే వరకు ఆయా నెంబర్లను పదేపదే చేస్తుండేవారు. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తుల వివరాలు సేకరించి, ఆ తరువాత రుణం  మంజూరైందని, మరో రెండు రోజులకు  రుణాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నామని, అందుకు రెండు నెల వారీ వాయిదాలు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పి కొల్లగొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాధితుడు ఎవరైనా ఈ కాల్‌సెంటర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎత్తరు. ఈ రకమైన పక్కా ఆదేశాలు వీరికి రాజేష్‌ నుంచి అందేవి. హైదరాబాద్‌లో మకాం పెట్టిన ఈ గ్యాంగ్‌ ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలనే టార్గెట్‌గా చేసుకుందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. రాజేష్‌ దొరికితే ఈ స్కామ్‌లో అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement