ఫోన్‌లో చూసి, ఖైదీల సాయంతో

UP Hostage Taker Studied Similar Cases Said Police - Sakshi

సాక్షి, ఫరూఖాబాద్‌ (యూపీ): పుట్టిన రోజు నెపంతో ఓ పాత నేరస్థుడు 23 మంది పిల్లలను బందీ చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇది పక్కా ప్లాన్‌తో చేశారని, దీనికోసం వారు పలు కేసులను జల్లెడ పట్టారని పోలీసులు వెల్లడించారు. ఫరూఖాబాద్‌లోని కసారియా గ్రామానికి చెందిన సుభాష్‌ బథం గురువారం తన కూతురి పుట్టినరోజని చెప్పి పిల్లలను ఇంటికి రప్పించుకోగా వారందరినీ ఇంట్లో బంధించిన సంగతి తెలిసిందే. పిల్లలను సరక్షితంగా తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో సుభాష్‌ మరణించాడు. అనంతరం అతని మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రష్యా కేసు ప్రేరణగా తీసుకుని
ఈ ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీనికోసం నెల ముందు నుంచే వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు గతంలో ఇలాంటి కేసుల గురించి ఆన్‌లైన్‌లో వెతికి, ఆ సమాచారాన్ని డౌన్‌లౌడ్‌ చేసుకున్నాడు. బాంబు తయారీలో మెళకువలను సైతం నేర్చుకున్నాడు. ఇక 2004లో రష్యాలో పిల్లలను నిర్భందించిన ఘటనను ఉదాహరణగా తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతోపాటు మరిన్ని కేసులను అధ్యయనం చేశాకే పకడ్బందీగా నేరానికి ఒడిగట్టారు. కాగా ఇప్పటికే ఓ కేసులో నాలుగు నెలల జైలు శిక్ష అనుభవించిన సుభాష్‌ ఈ నేరానికి తోటి ఖైదీల సహాయం తీసుకున్నాడు. వారి తోడ్పాటుతో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సేకరించాడు.

ఇంటి కింద బాంబ్‌
ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చాక ముందస్తు ప్రణాళిక మేరకు పిల్లలను బందీ చేసే ఇంటి కింద భాగంలో బాంబ్‌లను పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేరంలో అతని భార్య కూడా పాలుపంచుకుంది. నిర్భందించిన పిల్లలను విడుదల చేయడానికి స్థానికుల దగ్గర నుంచి ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున డబ్బులు డిమాండ్‌ చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఘటన అనంతరం స్థానికులు ఆమెను రాళ్లతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. నిందితుని ఇంటి నుంచి తుపాకీ, తూటాలు, కాట్రిడ్జ్‌లు, నాటు బాంబులు, హానికర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: 

పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!

దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్‌ఎస్‌జీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top