పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!

23 children taken hostage were rescued - Sakshi

ఫరూఖాబాద్‌(యూపీ): పుట్టినరోజు అంటూ 23 మంది చిన్నారులను పిలిచి బంధించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి హతమార్చగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతని భార్య.. గ్రామస్తుల చేతిలో చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లా కసారియా గ్రామంలో జరిగిందీ ఘటన. చిన్నారులను బందీగా చేపట్టి, వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సంచలన ఘటన చివరకు సుఖాంతమైంది. సుభాష్‌ బాథమ్‌(40)పై గతంలో హత్య కేసు ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి పుట్టిన రోజు వేడుకులకు రావాలంటూ గురువారం  గ్రామంలోని చిన్నారులను తన ఇంటికి పిలవగా 23 మంది పిల్లలొచ్చారు. అందర్నీ ఇంటి బేస్‌మెంట్‌లో బంధించాడు.

హత్య కేసును వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ ఇల్లు ఇస్తామని నచ్చజెప్పేందుకు యత్నించినా సుభాష్‌ వినలేదని డీజీపీ ఓపీ సింగ్‌ చెప్పారు.  సుభాష్‌ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులకు, ఒక గ్రామస్తుడికి గాయాలయ్యాయన్నారు.  ఇంటి వెనుకవైపు నుంచి తలుపు బద్ధలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. వారిపై సుభాష్‌ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. తర్వాత పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్‌ భార్య రూబీను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. సుభాష్‌ ఇంటి నుంచి పోలీసులు తుపాకిని, రైఫిల్‌ను, రెండు డజన్ల కాట్రిడ్జ్‌లను, 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే  పిల్లలను బందీలుగా ఉంచుకునే ఆలోచనలో ఆ దంపతులు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top