హైవే చోరుల హైఫై లైఫ్‌

Highway Robbery Gang Hifi Life In Hyderabad - Sakshi

‘కంజర్‌ కెర్వా’ ముఠా రూటే వేరు  

చోరీ సొత్తుతో విలాస జీవితం అద్భుత భవంతులు, కార్లు కొనుగోలు

దొంగ సొమ్ముతోనే వ్యాపారాల నిర్వహణ  

ఒక వారం ఇంట్లోను.. మరో వారం హైవే వెంట..  

ఇళ్లపై కాపాలాగా కొడుకులు నియామకం

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని హైవేల్లో వెలసిన దాబాలు, హోటల్స్‌ వద్ద ఆపే బస్సులే వారి టార్గెట్‌. ఆ వాహనాల్లోని ప్రయాణికులు భోజనానికి వెళితే నగదు, బంగారు ఆభరణాలున్న బ్యాగ్‌లను చోరీ చేస్తారు. వారే ‘కంజర్‌ కెర్వా’ ముఠా దొంగలు. వీరు చేసేది దొంగతనాలే అయినా ‘లగ్జరీ’ జీవనాన్ని అనుభవిస్తున్నారు. చోరీ సొత్తుతో మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లా మన్వర్‌ తాలూకా కెర్వా జాగీర్‌లోని ఉన్న కొండపై ముల్తానిపుర కాలనీలో అందమైన భవంతులు నిర్మించుకొని సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. దాదాపు 70 నుంచి 80 ఇళ్లు ఉన్న ఈ కాలనీలో 60 ఇళ్లు విలాసవంతంగా ఆర్‌సీసీ టెక్నాలజీతో నిర్మించడం గమనార్హం. సిటీ లైఫ్‌స్టైల్‌ తరహా వాతావరణం వారి ఇళ్లలో కనిపిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాకూడదని స్థానికంగా కొన్ని వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరు పాఠశాల నడుపుతుండగా, మరికొందరు ఇతర వ్యాపకాలను ఎంచుకున్నారు. గురువారం కూకట్‌పల్లిలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితుల చరిత్రను చూస్తే వారు చదువుకున్నది తక్కువైనా... వారి తెలివేంటో చెబుతోంది.

మైదర్‌ అలీ కాశమ్‌..  
చోరీ సొత్తుతో పాఠశాల ఏర్పాటు  గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ జిల్లా జాంకావావ్‌ గ్రామానికి చెందిన మైదర్‌ అలీ కాశమ్‌ ముల్తాని ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో
కలిసి 2004లో    కెర్వా జాగీర్‌లోని ముల్తానిపురకు వలస వెళ్లాడు. అక్కడ కొందరితో ఏర్పడిన పరిచయంతో 2008 నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు. నెలలో రెండు రోజులు మాత్రమే ఊరు నుంచి బయటకు వెళ్లే కాశమ్‌.. చోరీలు చేసేందుకు దాదాపు పది రాష్ట్రాలు చుట్టి వచ్చాడు. ఇలా చోరీలు చేయగా వచ్చిన డబ్బుతో 500 గజాల్లో ఆర్‌సీసీ టెక్నాలజీతో అందమైన భవంతిని నిర్మించాడు. రెండేళ్ల క్రితం ‘ఆనంద్‌ ఇంగ్లిష్‌ హైస్కూల్‌’ను ప్రారంభించగా 250 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. రెండు స్కూల్‌ బస్సులతో పాటు మారుతీ స్విఫ్ట్‌ డిజైన్‌ కారు కూడా కొనుగోలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ చోరీలు చేశాడు. ఇప్పటివరకు ఏ కేసులోనూ కాశమ్‌ అరెస్టు కాలేదు. అయితే 2015 నుంచి పూణే పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. 

సికిందర్‌ రజాక్‌.. ఆదాయం చాలాక చోరబాట..
కేర్వా జాగిర్‌కే చెందిన సికిందర్‌ రజాక్‌ ఐదో తరగతి వరకు మాత్రమే చదివాడు. టైలరింగ్‌ చేస్తున్న సికిందర్‌కు లగ్జరీ జీవితానికి ఆదాయం చాలకపోవడంతో 2004 నుంచి చోరీల బాటపట్టాడు. తమ గ్రామస్తులతో కలిసి హైవేల్లో బస్సుల్లో చోరీలు చేయడం ప్రారంభించి ముఠా నాయకుడిగా ఎదిగాడు. నెలలో 28 రోజులు ఊర్లో ఉంటే రెండు రోజులు మాత్రమే చోరీలకు బయటకు వెళ్లేవాడు. దీంతో ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. ఆర్‌సీసీ టెక్నాలజీతో అందమైన భవంతిని నిర్మించుకున్న రజాక్‌ కారు కూడా కొన్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి పది రాష్ట్రాల్లో జరిగిన చోరీల్లో ఇతడికి ప్రమేయముంది. 

మోసిన్‌ ఖాన్‌..  ‘దొంగ’ తండ్రికి వారసుడు..  
ఎనిమిదో తరగతి చదివిన మోసిన్‌ ఖాన్‌ తండ్రి సలావుద్దీన్‌ చోరీలు చేసేవాడు. ఎనిమిదేళ్ల క్రితం సలావుద్దీన్‌ ఆనారోగ్యంతో చోర వృత్తి నుంచి తప్పుకోవడంతో ఆ వారసత్వాన్ని మోసిన్‌ ఖాన్‌ అందిపుచ్చుకున్నాడు. 2010లో చోరీల బాటలో ఉన్న మోసిన్‌ ఖాన్‌కు రెండస్తుల అందమైన భవంతి కొనుగోలు చేయడంతో పాటు కారులో తిరుగుతుంటాడు. దాదాపు పది రాష్ట్రాల్లో నేర ప్రమేయమున్నా ఇప్పటి వరకు పోలీసులు పట్టుబడలేదు. 

తయ్యుబ్‌.. అఫ్సర్‌ ఖాన్‌ ఒకరు డ్రైవర్‌.. ఇంకొకరు మెకానిక్‌  
మూడో తరగతి మాత్రమే చదివిన మహమ్మద్‌ తయ్యుబ్‌ ఖాన్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఇటీవల తమ గ్రామస్తుడైన హైదర్‌ గ్యాంగ్‌లో సభ్యుడిగా చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడు. అలాగే చదువుకొని అఫ్సర్‌ ఖాన్‌ మెకానిక్‌గా పనిచేస్తూ తమ గ్రామస్తులతో కలిసి చోరీల బాట పట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వచ్చి వెళ్లాడు.

దొంగల పిల్లలే ఇళ్లకు కాపలా..
చోరీలు చేస్తూ భారీగా డబ్బులు సంపాదించిన ఈ నిందితుల పిల్లలంతా వారి ఊర్లోకి కొత్తగా ఎవరు వస్తున్నారో కనిపెడుతుంటారు. వారు కట్టుకున్న భవనంపైనే కాపలాకాస్తూ (వాచ్‌డాగ్‌) కొత్త వాహనం, కొత్త వ్యక్తి ఎవరైనా కనిపిస్తే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తుంటారు. దీంతో వారు ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊర్లకు వెళుతుంటారు. ఆ వాహనం, వ్యక్తులు తిరిగి వెళ్లిపోయారని సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందుకున్నాక మళ్లీ తిరిగొస్తారు. అయితే విలాస జీవితాన్ని అనుభవిస్తున్న ఈ నిందితులంతా తమ పిల్లలను చదివించడం లేదు. ఆడపిల్లలను అసలు పాఠశాలకే పంపరు. కొడుకులను కూడా ఏడో తరగతి వరకు మాత్రమే పరిమితం చేసి ‘చోర వృత్తి’లోకి తీసుకొస్తుండడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top