ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’ | High-Power Electric Wires Have Killed Person In Ongole | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

Aug 1 2019 10:45 AM | Updated on Aug 1 2019 10:46 AM

High-Power Electric Wires Have Killed Person In Ongole - Sakshi

షేక్‌ అఫ్రిది

సాక్షి, ఒంగోలు : హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన స్థానిక అంజయ్యరోడ్డులో బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అద్దంకి భవానీ సెంటర్‌ దామావారిపాలెంకు చెందిన షేక్‌ అఫ్రిది(21) స్థానిక మధు ఫ్లెక్సీ సంస్థలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానిక అంజయ్యరోడ్డులోని విజయభారతి కోచింగ్‌ సెంటర్‌కు చెందిన ఫ్లెక్సీ కట్టేందుకు ఆఫ్రిదితో పాటు స్థానిక కరణం బలరాం కాలనీకి చెందిన షేక్‌ ఆసిఫ్‌ కూడా డాబా పైకి ఎక్కారు.

అయితే హైటెన్షన్‌ వైర్లు కేవలం కొద్దిపాటి ఎత్తులోనే ఉండడం, ఫ్లెక్సీకి ఐరన్‌ ఫ్రేమ్‌ ఉండడంతో విద్యుత్‌ ఫ్లెక్సీ ఫ్రేమ్‌కు సోకింది. దీంతో హై టెన్షన్‌ విద్యుత్‌ కావడంతో దానిని బలంగా పట్టుకున్న ఆఫ్రిది దానిని పట్టుకున్నట్లుగానే కుప్పకూలిపోయి మృతి చెందగా , రెండో వ్యక్తి ఆసిఫ్‌ మాత్రం స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. 

పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు
సంఘటన జరగగానే ఆఫ్రిది, ఆసిఫ్‌ ఇరువురు నుంచి వెలువడిన గావుకేకలతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. సమీపంలోని వారు హైటెన్షన్‌ విద్యుత్‌ ప్రసారం అవుతుంది పైకి ఎవరు వెళ్లవద్దంటూ కేకలు వేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. సమాచారం అందడంతోనే పోలీసులు, అగ్నిమాపక శాఖ, విద్యుత్‌శాఖ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ ఆసిఫ్‌ను కిందకు దించి వైద్యం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. విద్యుత్‌ ప్రసారాన్ని పూర్తిగా నిలుపుదల చేయించి ఆఫ్రిది మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో అంజయ్యరోడ్డులో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. 

ఆ అనుమతులు ఏమైనట్లు ?
వాస్తవానికి ఈ హైటెన్షన్‌ వైర్లను నగరంలో నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున గతంలో ఆందోళనలు జరిగాయి. అనేక మంది అమాయకులు వీటి కారణంగా బలయ్యారు. బుధవారం జరిగిన సంఘటన ఈ ఏడాదిలో మూడోది కావడం గమనార్హం.  ట్రాన్స్‌కో అధికారులు హైటెన్షన్‌ వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.54.32కోట్లతో అంచనాలు రూపొందించారు.

ఈ మేరకు ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ ప్రస్తుతం ఉన్న హైటెన్షన్‌ వైర్లను తొలగించి వాటి స్థానంలో 132 కేవీ డీసీ ఎక్స్‌ఎల్‌పీఈ అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వైర్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు న్యూఢిల్లీలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌/ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌/ ఇతర నిధులను అందించే సంస్థల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి ఏపీ ట్రాన్స్‌కో నుంచి పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైనట్లు ట్రాన్స్‌కో పరిపాలన విభాగం పేర్కొంటూ రూ.54కోట్ల 32 లక్షల 15వేలుకు ఆమోదం తెలిపింది. 

హైటెన్షన్‌ కారణంగా ప్రమాదం జరిగిందని తెలియడంతోనే విద్యుత్‌ ప్రసారాన్ని నిలుపుదల చేయించి హుటాహుటిన చేరుకున్నాం. విజయభారతి కోచింగ్‌ సెంటర్‌ ఉన్నం చంద్రరావు నిర్వహిస్తున్నారని, ఆ సంస్థకు చెందిన ఫ్లెక్సీని కడుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. అయితే ఈ ఫ్లెక్సీని ప్రమాదకరమైన ప్రాంతంలో కట్టమని ఎవరు ప్రోత్సహించారనే దానిపై విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకుని అన్ని డిపార్టుమెంట్లను సమన్వయం చేసుకున్నట్లు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement