సినీ హీరో కారు ఢీకొని మహిళ మృతి | Hero Sudhakar Komakula Car Accident in Mangalagiri | Sakshi
Sakshi News home page

సినీ హీరో కారు ఢీకొని మహిళ మృతి

Apr 28 2019 8:10 AM | Updated on Apr 28 2019 8:10 AM

Hero Sudhakar Komakula Car Accident in Mangalagiri - Sakshi

మృతి చెందిన మహిళ జలసూత్రం లక్ష్మి, ప్రమాదానికి నుజ్జునుజ్జు అయిన కారు

మంగళగిరి: తెలుగు సినిమా పరిశ్రమ వర్ధమాన కథానాయకుడు సుధాకర్‌ కోమాకుల కారు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ ఫేం సుధాకర్‌ తన కొత్త సినిమా ‘‘నువ్వు తోపురా’’ ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్‌ నిత్యాషెట్టితో కలిసి గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు కారులో వెళ్తున్నాడు.

మరికొద్ది సేపట్లో గుంటూరు చేరుకుంటారనగా వేగంగా వెళ్తున్న కారు.. జాతీయ రహదారి డివైడర్లపై మొక్కల సంరక్షణ పనిచేసే చినకాకాని గ్రామానికి చెందిన మహిళ జలసూత్రం లక్ష్మి (36)ని ఢీ కొట్టింది. ఆ వేగానికి ఎగిరిపడ్డ లక్ష్మి సమీపంలో ఉన్న ట్రాక్టర్‌కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. డివైడర్‌లో నాటేందుకు ట్రాక్టర్‌లో మొక్కలు తీసుకురాగా లక్ష్మి ఎర్ర జెండా పట్టుకుని అటుగా వచ్చే వాహనాలకు సిగ్నల్‌ ఇస్తోంది. ఆ సిగ్నల్‌ను గుర్తించకుండా వేగంగా కారు రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను కూడా ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సీటు బెల్టు పెట్టుకోని డ్రైవర్‌ సుందరరావుకు తీవ్ర గాయాలవగా పక్క సీట్లో సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్న హీరో సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారులో వెనుక ఉన్న హీరోయిన్‌ నిత్యాషెట్టి ప్రమాదం తర్వాత అక్కడి నుంచే తిరిగి వెళ్లిపోయింది. స్థానికులు లక్ష్మి మృతదేహంతో పాటు డ్రైవర్, హీరో సుధాకర్‌లను ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. ముఠా కూలి పని చేసే లక్ష్మి భర్త.. తమకు పుట్టిన కుమారుడితో పాటు మరో అనాథను లక్ష్మి పెంచుతోందని, వారికి దిక్కెవరంటూ విలపించడం అక్కడున్న వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మంగళగిరి రూరల్, పట్టణ సీఐలు శరత్‌బాబు, రవిబాబు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement