‘హుండీ’ దందా.. వెయ్యి కోట్లు!

hawala racket busted in Hyderabad police seized heavy amount - Sakshi

నగరంలో అక్రమంగా ద్రవ్యమార్పిడి దందా టర్నోవర్‌

ఐదు కీలక ముఠాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు

ఓ గ్యాంగ్‌ను పట్టుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

ఆరుగురు అరెస్టు, రూ.1.4 కోట్లు స్వాధీనం

ఐటీ విభాగానికి కేసు : పోలీసు కమిషనర్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అక్రమంగా ద్రవ్యమార్పిడికి పాల్పడే హవాలా, హుండీ ముఠాల వార్షిక టర్నోవర్‌ రూ.వెయ్యి కోట్లు ఉండొచ్చని సిటీ పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికీ గుర్తించిన ఐదు ముఠాల్లో ఓ గ్యాంగ్‌ను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరి టర్నోవరే ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. మొత్తం ఆరుగురు నిందితుల్ని పట్టుకుని వారి నుంచి రూ.1.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారంతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

‘వజ్రాల’కన్నా ‘హుండీ’మేలని...
రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్యమార్పిడిని హవాలా అని, దేశంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే దాన్ని హుండీ అని అంటారు. గుజరాత్‌కు చెందిన జయేశ్‌ కుమార్‌ పటేల్‌ అలియాస్‌ అతుల్‌ 2009లో హైదరాబాద్‌కు వలసవచ్చాడు. అబిడ్స్‌ కేంద్రంగా వజ్రాలు, బంగారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాలతో పరిచయం ఏర్పడింది. దీంట్లో లాభాల గురించి తెలుసుకుని చిరాగ్‌ అలీ లైన్‌లో ఓ కార్యాలయం అద్దెకు తీసుకుని ఏకంగా హుండీ దందా చేసే కంపెనీ తెరిచాడు. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న హుండీ వ్యాపారులు, ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2013 నుంచి ఈ దందా చేస్తున్న పటేల్‌ను 2014లో ఓసారి ఐటీ అధికారులు పట్టుకున్నా తీరు మార్చుకోలేదు.

వాట్సాప్‌ను విరివిగా వాడేసుకుంటూ...
ప్రధానంగా బడా వ్యాపారులు పన్ను ఎగ్గొట్టడానికి, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి హవాలా, హుండీ మార్గాలను ఆశ్రయిస్తుంటారు. నగరానికి చెందిన రియల్టర్లు, బంగారం వ్యాపారులతో పాటు బడా వ్యాపారులకు పటేల్‌ సహకరిస్తున్నాడు. నగదు తీసుకునే పటేల్‌ రూ.50 లేదా రూ.100 నోటు నంబర్‌ను చెప్పడమో, వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేయడమో చేస్తాడు. దీన్ని సదరు సంస్థకు చెందిన వ్యక్తులు నగదు రిసీవ్‌ చేసుకోవాల్సిన వారికి వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. పటేల్‌ సైతం అదే నంబర్‌ను ఆయా నగరాల్లో ఉన్న తమ ఏజెంట్‌కు పంపిస్తాడు. నగదు తీసుకోవాల్సిన సంస్థ ప్రతినిధి ఈ నంబర్‌ను అక్కడి ఏజెంట్‌కు చెప్తే చాలు ఆ మొత్తం అతడికి అందుతుంది.

రూ.లక్షకు 600 వరకు కమీషన్‌...
దందా చేసినందుకు హవాలా, హుండీ ఏజెంట్లు రూ.లక్షకు రూ.600 వరకు కమీషన్‌ తీసుకుంటారు. ఈ పర్సెంటేజ్‌లో నగదు తీసుకున్న ఏజెంట్, డెలివరీ ఇచ్చిన ఏజెంట్‌ చెరి సగం తీసుకుంటారు. హవాలా, హుండీ ఏజెంట్ల మధ్య లావాదేవీలన్నీ 3 నెలలకోసారి జరుగుతాయి. ఈ మొత్తాన్ని నగదు, విలువైన వస్తువుల రూపంలో మార్పిడి చేసుకుంటారు. పటేల్‌ గ్యాంగ్‌ ప్రతి ఏడాదీ రూ.200 కోట్ల వరకు టర్నోవర్‌ చేస్తోంది. మిగిలిన ముఠాలూ ఇలాగే రెచ్చిపోతున్నాయి. పటేల్‌ దందాపై నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు ఉప్పందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్‌ రవి, బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌ వారం రోజులుగా నిఘా ముమ్మరం చేశారు.

కంపెనీలకు డెలివరీ చేయగా...
నగరానికి చెందిన కన్నయ్య అగర్వాల్‌ రాయలసీమ స్టీల్‌ రీ–రోలింగ్‌ మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఒడిశాకు చెందిన నిమిశ్‌.. స్కాన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ సంస్థకు యజమాని. దీనికి బంజారాహిల్స్‌లో ఓ బ్రాంచ్‌ ఉంది. ఈ సంస్థలూ ఇటీవల రాయ్‌పూర్, ఒడిశాల్లోని హోల్‌సేల్‌ వ్యాపారులకు ఐరన్‌ డెలివరీ చేశాయి. వాటి నుంచి రావాల్సిన చెల్లింపులు హుండీ రూపంలో పటేల్‌ కంపెనీకి వచ్చాయి. ఈ మొత్తాన్ని డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ‘స్కాన్‌ ఎనర్జీ’ఉద్యోగి బి.విఘ్నేశ్వర్, రాయలసీమ సంస్థ ఉద్యోగి గణేశ్‌ సత్యనారాయణ సబూ వేర్వేరుగా పటేల్‌ నుంచి డబ్బు తీసుకుని వస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. 2 వాహనాలతో పాటు రూ.75 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. వీరిచ్చిన సమాచారంతో పటేల్‌ కార్యాలయంతో పాటు స్కాన్‌ సంస్థలో టాస్క్‌ఫోర్స్‌ సోదాలు చేసింది.

అప్పటికే కొంత మొత్తం డెలివరీ...
విఘ్నేశ్వర్‌ అప్పటికే కొంత నగదును తన కార్యాలయంలోని చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అరుణ్‌ కుమార్‌ ధడ్చీకి అప్పగించినట్లు చెప్పాడు. అరుణ్‌ను పట్టుకున్న అధికారులు రూ.47.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పటేల్‌ కంపెనీపై దాడి చేసి అతడితో పాటు ఉద్యోగి ప్రదీప్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రూ.18.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్నవారితో పాటు స్వాధీనం చేసుకున్న నగదునూ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డికి అప్పగిస్తున్నామని పోలీసు కమిషనర్‌ చెప్పారు. సిటీలో ఉన్న మిగిలిన అక్రమ ద్రవ్యమార్పిడి ముఠాల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కన్నయ్య, నిమిశ్‌కూ నోటీసులు జారీ చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top