గోవిందరాజస్వామి కిరీటాల దొంగ అరెస్టు

Govindaraja Swamy Crown Theif Arrested - Sakshi

ఎట్టకేలకు కేసును ఛేదించిన పోలీసులు

తిరుమల : తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసును ఎట్టకేలకు అర్బన్‌ జిల్లా పోలీసులు ఛేదించారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బురాజన్‌ తెలిపిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి 1కేజీ 351 గ్రాముల 3 బంగారు కిరీటాలు చోరీకి గురయ్యాయి. విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 80 రోజుల పాటు విచారణ చేసి ఎట్టకేలకు దొంగను మంగళవారం రేణిగుంట రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద సిట్‌ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి బృందం అరెస్టు చేసింది. మహారాష్ట్ర, నాందేడు జిల్లా, ఖాందార్‌ తాలూకా, బూమ్‌నగర్‌ స్ట్రీట్, స్వప్న భూమ్‌నగర్‌కు చెందిన బాలాజీ పవార్‌ కుమారుడు ఆకాష్‌ పవార్‌ సరోడీ (25)ని నిందితుడిగా గుర్తించారు. 2014లో అతనికి వివాహం కాగా మూడున్నరేళ్లు వయసు గల శారద అనే కుమార్తె ఉంది. 2018 నుంచి తిరుపతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని విష్ణు నివాసం వద్ద సెల్‌ఫోన్లు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు.

దొంగతనం జరిగిందిలా..
2019 ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య గోవిందరాజస్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని, పక్కనే ఉన్న కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కూర్చున్నాడు. అక్కడ ఉత్సవ విగ్రహాలపై ఉన్న బంగారు కిరీటాలు గమనించాడు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకుని మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో రెక్కీ నిర్వహించాడు. ఫిబ్రవరి 2న మళ్లీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నాడు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలపై ఉన్న మూడు కిరీటాలను దొంగిలించి నాందేడ్‌ వెళ్లిపోయాడు. స్నేహితుడితో కలసి బంగారు కిరీటాలు అమ్మేందుకు ప్రయత్నించాడు. నలగ్గొట్టి ఉండడంతో ఎవరూ కొనడం లేదని, దానిని కత్తిరించి ముక్కలు ముక్కలుగా చేశారు. అనంతరం కరిగించగా 1351 గ్రాములు కాగా, రూ.40 లక్షలకు పైగా విలువ ఉంటుందని గుర్తించారు.  

సెల్‌ఫోన్‌ కోసం వచ్చి దొరికిపోయాడు..
బంగారు అచ్చును తీసుకుని చెన్నైలో విక్రయించాలని స్నేహితుడితో కలసి ఆకాష్‌ పవార్‌ సరోడీ పథకం వేశాడు. అయితే తిరుపతిలో గతంలో తను దొంగతనం చేసి..ముళ్లపొదల్లో పడేసిన ఓ సెల్‌ఫోన్‌ను తీసుకుపోదామని నిశ్చయించుకున్నాడు. బంగారం అమ్మలేకపోతే సెల్‌ఫోన్‌ అయినా అమ్ముకోవచ్చునని భావించాడు. చెన్నైలో బంగారాన్ని అమ్మడానికి చుట్టుపక్కలవారిని విచారించాలని  ముందుగా తన స్నేహితుడిని సోమవారం అక్కడకు పంపాడు. అనంతరం నిందితుడు బస్టాండు చేరుకుని ముళ్ల పొదల్లో దాచిన  సెల్‌ఫోన్‌ వెతికి తీసుకున్నాడు. ఆ రాత్రికి అక్కడే ఉండి బంగారంతో సహా రేణిగుంట నుంచి మంగళవారం చెన్నైకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1351 గ్రాముల బంగారం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు 80 రోజులపాటు ఆరు బృందాలు  బిహార్, జార్ఖండ్, బెంగళూరు, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ముమ్మరంగా తనిఖీ చేసి, 78 కెమెరాల్లో నిందితుడ్ని గుర్తించి పట్టుకున్నారు. కాగా నిందితులను పట్టుకున్న పోలీసులకు త్వరలోనే రివార్డులు ఇస్తామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top