గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కీలక పరిణామం

Gauri Lankesh Murder Case SIT Filed Charge Sheet - Sakshi

సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కేటీ నవీన్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిన పోలీసులు, కోర్టులో దాఖలు చేసింది. ఇక ఛార్జీషీట్‌లో ఆమె హత్యకు గల కారణంపై సిట్‌ బృందం స్పష్టత ఇచ్చేసింది. ‘గౌరీ లంకేశ్‌ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు తనతో చెప్పినట్లు నిందితుడు నవీన్‌ పేర్కొన్నట్లు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు. అంతేకాదు ఆ ప్రధాన నిందితుడికి బుల్లెట్లు కూడా తానే సరఫరా నవీన్‌ ఒప్పుకున్నాడు. ఈ మేరకు మొత్తం 131 పాయింట్లతో 12 పేజీల ఛార్జీ షీట్‌ను రూపొందించిన సిట్‌ బృందం, మే 30న మెజిస్ట్రేట్‌కు సమర్పించింది.

ఛార్జీషీట్‌లో వివరాలు... డిగ్రీ మధ్యలోనే ఆపేసిన కేటీ నవీన్‌ కుమార్‌.. హిందూ అతివాద సంఘాల పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 2014లో హిందూ యువ సేనే అనే సంస్థను తానే సొంతంగా స్థాపించాడు. మంగళూర్‌ పబ్‌ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కున్న శ్రీరామ్‌ సేనే స్థాపకుడు ప్రమోద్‌ ముతాలిక్‌తో నవీన్‌ తరచూ భేటీ అయ్యేవాడు. మరోపక్క అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తాడన్న ఆరోపణలు నవీన్‌పై గతంలో వినిపించేవి. ఈ క్రమంలో ఓ సదస్సుకు హాజరైన నవీన్‌కు ప్రవీణ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. 

                                 నిందితుడు నవీన్‌ కుమార్‌

బుల్లెట్ల కోసం... ఆ తర్వాత నవీన్‌తో సత్సంబంధాలు కొనసాగించిన ప్రవీణ్‌.. ఓ రోజు ఏకంగా ఇంటి వెళ్లి బుల్లెట్ల కోసం ఆరా తీశాడు. తొలుత నవీన్‌ అతనికి రెండు బుల్లెట్లు ఇవ్వగా.. ప్రవీణ్‌ మాత్రం నాణ్యమైనవి కావాలంటూ కోరాడు. ‘గౌరీ లంకేశ్‌ హిందూ వ్యతిరేకి. ఆమెను చంపేందుకే ఈ బుల్లెట్లు’ అంటూ తనతో చెప్పినట్లు స్టేట్‌మెంట్‌లో నవీన్‌ పేర్కొన్నాడు. బెంగళూరు, బెలగామ్‌లో హత్యకు ప్రణాళిక రచించారని, హత్యకు ముందు ఆమె ఇంటి వద్ద పలు మార్లు  హంతకులు రెక్కీ నిర్వహించారని నవీన్‌ పేర్కొన్నాడు. ఫ్లాన్‌ ప్రకారం చివరకు సెప్టెంబర్‌ 5వ తేదీన ఆమెను హత్య చేసినట్లు నవీన్‌ వివరించాడు. అయితే ఆమె హత్యకు గురైందన్న వార్త మరుసటి రోజు పేపర్‌లో చూసేదాకా తనకూ తెలీదని నవీన్‌ చెబుతున్నాడు.

మరో హత్యకు కుట్ర... సాహితీవేత్త, హేతువాది కేఎస్ భగవాన్‌ హత్యకు కూడా కుట్ర పన్నినట్లు నవీన్‌ అంగీకరించాడు. ఫోన్‌ కాల్స్‌లో సంభాషణల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి రాగా, విచారణలో నిందితుడు ఒప్పకున్నాడు. కాగా, ప్రముఖ రచయిత కుల్బర్గి హత్య(2015) తర్వాత.. భగవాన్‌కు పోలీసులు భద్రత పెంచిన విషయం తెలిసిందే.

                                                రచయిత ఎంఎం కుల్బర్గి

ఒకే తుపాకీ... రెండేళ్ల క్రితం రచయిత ఎంఎం కుల్బర్గి(77) హత్య కోసం ఉపయోగించిన తుపాకీ, గౌరీ లంకేశ్‌ హత్య కోసం వాడిన తుపాకీ ఒక్కటేనని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు పోలీసులు మెజిస్ట్రేట్‌కు సమర్పించిన ఛార్జీషీట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు. 

గతేడాది సెప్టెంబర్‌ 5వ తేదీన సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లౌకికవాదిగా, కన్నడ వార పత్రిక ‘లంకేశ్‌ పత్రికే’ ఎడిటర్‌గా ప్రసిద్ధి చెందిన గౌరీ హత్యకు గురికావడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది.  మాండ్యా జిల్లాకు చెందిన కేటీ నవీన్‌ కుమార్‌ ఈ ఏడాది మార్చిలో తన దగ్గర ఉన్న తుపాకీని ​ఓ వ్యక్తికి అమ్మేందుకు యత్నించాడు. అయితే అనుమానంతో పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌.. అతనికి సహకరించిన వారు ఎవరన్నది తేలాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top