వికాస్‌ దుబే అరెస్ట్‌

Gangster Vikas Dubey arrested in Ujjain - Sakshi

భోపాల్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను పోలీసులు ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో గురువారం అరెస్ట్‌ చేశారు. దుబే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్‌ చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు. ‘ఉజ్జయిన్‌లోని మహాకాల్‌ ఆలయానికి వికాస్‌ దుబే ఈ ఉదయం కార్లో వచ్చాడు. మొదట ఒక కానిస్టేబుల్‌ దుబేని గుర్తించాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆ కానిస్టేబుల్‌ అప్రమత్తం చేశాడు.

వారు దుబేను పక్కకు తీసుకెళ్లి, ప్రశ్నించి, అనంతరం అరెస్ట్‌ చేశారు’ అని మిశ్రా వివరించారు. అయితే, ఆలయ వర్గాలు మరోలా చెప్పాయి. ‘ఉదయం ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన దుబే.. రూ. 250 ల టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ తరువాత దేవుడికి సమర్పించేందుకు ప్రసాదం కొనాలని దగ్గర్లోని షాపు వద్దకు వెళ్లాడు. దుబేను ఆ షాప్‌ ఓనర్‌ గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు’ అని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకువెళ్తుండగా, అక్కడ గుమికూడిన ప్రజలను చూస్తూ.. ‘నేను వికాస్‌ దుబే.. కాన్పూర్‌ వాలా’ అని గట్టిగా అరిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాంతో, దుబేను పట్టుకుని ఉన్న కానిస్టేబుల్‌ దుబే తలపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. నోర్మూసుకో అని గద్దించాడని వివరించారు. దుబేను తమ రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హర్షం వ్యక్తం చేశారు. అరెస్ట్‌ తరువాత ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేసి చెప్పానన్నారు. కాన్పూర్‌ నుంచి వచ్చిన పోలీసులకు మధ్యప్రదేశ్‌ పోలీసులు వికాస్‌ దుబేను అప్పగించారు.  

ఇద్దరు అనుచరుల హతం
రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దుబే అనుచరులు ఇద్దరిని గురువారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు హతమార్చారు. ఫరీదాబాద్‌లో బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసిన కార్తికేయను కాన్పూర్‌ తీసుకువెళ్తుండగా, పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని, పోలీసులపై కాల్పులు జరుపుతూ, పారిపోయేందుకు ప్రయత్నించాడని, దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో కార్తికేయ చనిపోయాడని ఏడీజీ ప్రశాంత్‌‡ తెలిపారు. ఎటావా వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో దుబే అనుచరుడు, కాన్పూర్‌ కాల్పుల ఘటనలో నిందితుడు ప్రవీణ్‌ అలియాస్‌ బవువా చనిపోయాడని ఎటావా ఎస్పీ ఆకాశ్‌ ప్రకటించారు.

ఎస్పీలో ఉన్నాడు
తన కుమారుడు వికాస్‌ దుబే ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో ఉన్నాడని ఆయన తల్లి సరళాదేవి తెలిపారు. అయితే, దీన్ని ఎస్పీ ఖండించింది. వికాస్‌ దుబే మొబైల్‌ ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ బయటపెడితే ఏ పార్టీకి చెందినవాడో తెలుస్తుందని వ్యాఖ్యానించింది.  సరిగ్గా వారం కిత్రం, శుక్రవారం రాత్రి దుబేను అరెస్ట్‌ చేసేందుకు కాన్పూర్‌లోని చాబీపుర్‌ ప్రాంతంలో ఉన్న బిక్రు గ్రామంలో ఉన్న ఆయన ఇంటికి పోలీసు బృందం వెళ్లింది.

వారిపై దుబే, ఆయన అనుచరులు ఇంటిపై నుంచి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు చనిపోయారు. హత్యలు సహా దాదాపు 60 క్రిమినల్‌ కేసుల్లో దుబే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. వాటిలో 20 ఏళ్ల క్రితం ఒక బీజేపీ ఎమ్మెల్యేను పోలీస్‌ స్టేషన్‌లోనే చంపేసిన కేసు కూడా ఒకటి. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు.

ఎన్‌కౌంటర్‌ తప్పించేందుకే..
దుబే లొంగిపోయాడని, దీనివెనుక మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత హస్తం ఉందని కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. యూపీ పోలీసుల ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించేందుకే ఉజ్జయిన్‌లో దుబే దొరికిపోయేలా చేశారన్నారు. మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top