అశ్రునయనాలతో అంత్యక్రియలు.. | The funeral ended | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో అంత్యక్రియలు..

May 28 2018 8:52 AM | Updated on Aug 30 2018 4:17 PM

The funeral ended  - Sakshi

వెంకటరత్నాపూర్‌లో రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

జిన్నారం(పటాన్‌చెరు) : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడకు చెందిన నవతెలంగాణ పత్రిక విలేకరి గొర్ల లక్ష్మణ్‌(38), కుమార్తె విజయ(5), తల్లిదండ్రులు మల్లేశ్‌(65), గండెమ్మ(58) మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆదివారం పెద్దమ్మగూడలో వారి అంత్యక్రియలు జరిగాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు గ్రామం మూగబోయింది. 

అన్ని దారులు పెద్దమ్మగూడ వైపే..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న మండల ప్రజలు పెద్దమ్మగూడకు భారీగా చేరుకున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడే ఉన్నారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

చికిత్స పొందుతున్న ముగ్గురు..

ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్‌ భార్య పుష్పలత, కుమారుడు ఆకాశ్‌ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో, కుమార్తె నిహారిక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న పుష్పలతను టీయూడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

వెంకటరత్నాపూర్‌లో..

తూప్రాన్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటరత్నాపూర్‌ గ్రామానికి చెందిన సత్తమ్మ(65) ఆమె మనువడు శ్రీనివాస్‌(11) తూప్రాన్‌ పట్టణానికి చెందిన వారి సమీప బంధువు గుజ్జ సుశీల ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారి పెద్ద కుమారుడు నర్సింలు అతని చిన్న కుమారుడు ఓంకార్‌ ఆదివారం మృతి చెందారు.

సత్తమ్మ పెద్ద కుమారుడి భార్య ధనమ్మ, కుమారుడు శ్రీకాంత్, చిన్నకుమారుడి భార్య లక్ష్మి, వారి కూతుళ్లు రేవతి, శ్రీవల్లిక ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం. వారితో పాటు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న చిన్నకుమారుడు మహేశ్‌ తల్లి సత్తమ్మ, అన్న నర్సింలు, వారి ఇద్దరు కుమారులు శ్రీనివాస్, ఓంకార్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. అంత్యక్రియలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివచ్చారు. తూప్రాన్‌కు చెందిన వీరి బంధువు సుశీల అంత్యక్రియలు సైతం ఆదివారం నిర్వహించారు.

నాయకుల పరామర్శ

తూప్రాన్‌: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని వెంకటరత్నాపూర్‌కు చెందిన సత్తమ్మ(65), ఆమె మనవడు శ్రీనివాస్‌(11) తూప్రాన్‌ పట్టణానికి చెందిన వారి సమీప బంధువు గుజ్జ సుశీల ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారి పెద్ద కుమారుడు నర్సింలు అతని చిన్న కుమారుడు ఓంకార్‌ ఆదివారం మృతి చెందారు.

ఆదివారం వీరి అంత్యక్రియలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఈ విషయం తెలుసుకున్న రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాష్ట్రఫుడ్‌కమిటీ చైర్మన్‌లు తూముకుంట నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మురళీయాదవ్, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి, మృతుల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వీరి వెంట మండలంలోని ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వెంకటరత్నాపూర్‌ కిక్కిరిసిపోయింది.

 ప్రభుత్వం ఆదుకోవాలి...

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజీవ్‌రహదారి నిర్మాణంలో అవకతవకల కారణంగానే రోడ్డు ప్రమాదం సంభవించినట్లు ఆయన ఆరోపించారు. ఇందుకు కావాల్సిన నివేదికను సేకరించి ప్రభుత్వంపై కోర్టుకు వెల్లనున్నట్లు తెలిపారు.      – బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement